: టీఆర్ఎస్ అంటే... కొత్త అర్థం చెప్పిన పొంగులేటి
దాదాపు 14 ఏళ్ల పాటు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అలుపెరగని పోరు సాగించిన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ఎట్టకేలకు లక్ష్యం చేరుకుంది. దీంతో కొత్త రాష్ట్రాన్ని పాలించే తొలి అవకాశాన్ని ప్రజలు ఆ పార్టీకే కట్టబెట్టారు. టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రస్తుతం ముఖ్యమంత్రిగా... ఆ పార్టీ ప్రభుత్వం రాష్ట్రంలో వినూత్న పథకాలతో దూసుకెళులోంది. అయితే రాష్ట్రాన్ని తామే ఇచ్చామని, కేసీఆర్ తెచ్చిందేమీ లేదని రాష్ట్రంలో విపక్ష కాంగ్రెస్ అంటోంది. దీంతో ఇరు పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ క్రమంలో నిన్న కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్య చేశారు. టీఆర్ఎస్ కు కొత్త అబ్రివేషన్ ను ఆపాదించారు. టీఆర్ఎస్ అంటే... టెండర్ల రాష్ట్ర సమితి అని ఆయన పేర్కొన్నారు. ‘‘రైతులకు పెరుగన్నం తినిపిస్తానని మాటలు చెప్పిన సీఎం కేసీఆర్, వాళ్లు పురుగుల మందు తాగి ఆత్మహత్యలు చేసుకుంటున్నా పట్టించుకోవడం లేదు. రైతన్నలు మరణించినా పట్టని టీఆర్ఎస్ ప్రభుత్వం కాంట్రాక్టులు, టెండర్లపై మాత్రం ప్రత్యేక దృష్టి సారించింది. ఆ పార్టీ టెండర్ల రాష్ట్ర సమితిగా మారిపోయింది. తెలంగాణలో తక్షణం వ్యవసాయ ఎమర్జెన్సీని ప్రకటించాలి’’ అని పొంగులేటి వ్యాఖ్యానించారు.