: పేపర్ పై రాసుకుని చదువుకుంటే కానీ సోనియా మాట్లాడలేరు: కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఎద్దేవా
కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీపై బీజేపీ నేత, కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ ఘాటు విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీల సస్పెన్షన్ పై గడచిన నాలుగు రోజులుగా సోనియా, రాహుల్ గాంధీల నేతృత్వంలో ఆ పార్టీ ఎంపీలు పార్లమెంటులో నిరసనలు కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా సోనియా గాంధీ ఎన్డీఏ ప్రభుత్వంపైనే కాక ప్రధాని నరేంద్ర మోదీ, విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ పై కూడా మాటల తూటాలు పేలుస్తున్నారు. సోనియా వ్యాఖ్యలపై కొద్దిపేపటి క్రితం స్మృతి ఇరానీ ఘాటుగా స్పందించారు. ‘‘ఏదేనీ అంశంపై స్పీచ్ ఇవ్వడం సోనియా గాంధీకి అంత ఈజీ ఏమీ కాదు. ప్రసంగ పాఠాన్ని పేపర్ పై రాసుకుని సాంతం చదువుకున్నాకే ఆమె మాట్లడగలరు’’ అని స్మృతి ఇరానీ వ్యాఖ్యానించారు.