: మీ నాన్నకు నీవైనా చెప్పు!... బాబూరావు డ్యాన్సులపై ఆయన కొడుకుతో గుంటూరు జడ్జి వ్యాఖ్య


గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలోని ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ బాబూరావుపై గుంటూరు లీగల్ సెల్ న్యాయమూర్తి ఘాటుగా స్పందించారు. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురుతర బాధ్యతల్లో ఉన్న బాబూరావు పిల్లలతో కలిసి డ్యాన్సులు చేయడం సిగ్గుమాలిన చర్యేనని జడ్జి వ్యాఖ్యానించారు. నేటి ఉదయం ఈ కేసు విచారణ సందర్భంగా బాబూరావుతో పాటు హాస్టల్ వార్డెన్ స్వరూపారాణి కోర్టు ముందు హాజరయ్యారు. ఈ సందర్భంగా బాబూరావు చర్యలను జడ్జి తప్పుబట్టారు. ‘‘పిల్లలతో కలిసి ఆ డ్యాన్సులేంటి? నీవైనా మీ నాన్నకు చెప్పు’’ అంటూ అక్కడే ఉన్న బాబూరావు కొడుకును ఉద్దేశించి జడ్జి అన్నారు. సీనియర్ల వేధింపులు తాళలేక బీఆర్క్ విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో బాబూరావుపై ఆరోపణలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ఇక వర్సిటీ వీసీ ఫిర్యాదుతో పోలీసులు బాబూరావు, ఇతరులపై కేసు నమోదు చేసినందున సుమోటోగా నమోదు చేసిన కేసును కొట్టివేస్తున్నట్లు లీగల్ సెల్ న్యాయమూర్తి ప్రకటించారు.

  • Loading...

More Telugu News