: ధనవంతులూ రాజకీయ మెతుకులకు ఎగబడుతున్నారు...‘మాఫీ’ని తిరస్కరించిన ఏపీ ఆదర్శ రైతు
ఏపీలోని కృష్ణా జిల్లా గుడివాడ పరిధిలోని దొండపాడుకు చెందిన లింగమనేని సురేష్ మధ్య తరగతి రైతు. ఉన్న 9 ఎకరాల పొలాన్ని సాగు చేసుకుంటూ ఊరిలోని తపాలా కార్యాలయంలో తాత్కాలిక ప్రాతిపదికన పోస్ట్ మాస్టర్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు. మొన్నటి ఎన్నికల సందర్భంగా రైతులకు హామీ ఇచ్చిన మేరకు ఏపీ ప్రభుత్వం సాగు రుణాలను మాఫీ చేసింది. ఇందులో సురేస్ బ్యాంకు నుంచి తీసుకున్న రూ.40 వేల రుణం కూడా మాఫీ అయ్యింది. అయితే విషయం తెలుసుకున్న సురేష్ నేరుగా బ్యాంకుకు వెళ్లి, తాను తీసుకున్న రుణంతో పాటు దానికి అయిన వడ్డీని చెల్లించేశారు. అదేంటని ప్రశ్నిస్తే, తనకు రుణమాఫీ అవసరం ఎంతమాత్రం లేదని తేల్చిచెప్పారు. రుణమాఫీ అవసరం ఉన్నంత ధీన స్థితిలో తానేమీ లేనని ప్రకటించిన ఆయన ప్రభుత్వ పథకాలు పొందే విషయంలో ఎవరికి వారు తమ చిత్త శుద్ధిని ప్రశ్నించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన ఓ లేఖ విడుదల చేశారు. ఆ లేఖలో ‘‘సంతృప్తి లేని జీవితం వ్యర్థం. సంతృప్తి గల జీవితం ధన్యం. నేడు అన్నది నిజం. రేపు అన్నది అబద్ధం. ధనవంతులు కూడా సత్యం, ధర్మం, న్యాయం గురించి ఆలోచించకుండా ప్రభుత్వం ఇచ్చే రాజకీయ మెతుకులకు ఎగబడి కష్టం లేకుండా వచ్చే డబ్బు కూడబెట్టుకుంటున్నారు. అలా ఉండటం నాకిష్టం లేదు. అందుకే రుణమాఫీని తిరస్కరించా. ప్రభుత్వ పథకాలు పొందే విషయంలో ఎవరికి వారు తమ చిత్తశుద్ధిని ప్రశ్నించుకోవాలి’’ అని ఆయన కోరారు.