: మేం నోటీసులిచ్చినా టీ-స్పీకర్ తీసుకోరు, ఏమీ చేయలేము: ఏపీ హైకోర్టు
కాంగ్రెస్, తెదేపా ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లపై తాము ఇచ్చే నోటీసును స్పీకర్ స్వీకరించరన్న విషయం తమకు తెలుసని హైకోర్టు వ్యాఖ్యానించింది. నోటీసులను తిరస్కరించే హక్కు ఆయనకుందని, ఈ నేపథ్యంలో మరోసారి నోటీసులు జారీ చేయలేమని తెలుగు రాష్ట్రాల హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి భోంస్లే, జస్టిస్ ఎస్‌వి భట్ లతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. పార్టీల ఫిరాయింపుదారులపై తాము ఇచ్చిన అనర్హత పిటిషన్లను వీలైనంత త్వరగా విచారించి, వాటిని పరిష్కరించాలని సూచిస్తూ నోటీసులు ఇవ్వాలని తెదేపా నేత ఎర్రబెల్లి దయాకర్ రావు, కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ లు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వాటిని విచారించిన కోర్టు పై వ్యాఖ్యలు చేసింది. అంతకుముందు అడ్వకేట్ జనరల్ తన వాదన వినిపిస్తూ, కోర్టులు జారీ చేసే నోటీసులను స్పీకర్ తీసుకోరని స్పష్టం చేశారు. అనంతరం కేసు విచారణను ఆగస్టు 20కి వాయిదా వేస్తున్నట్టు హైకోర్టు ప్రకటించింది.