: సోషల్ మీడియాకు పడుతుంది అడ్డుకట్ట!


అభ్యంతరకర సందేశాలతో పాటు, ప్రజలను అయోమయానికి గురిచేసే వదంతులు సోషల్ మీడియా ద్వారానే అధికంగా వ్యాపిస్తున్నాయని అభిప్రాయపడ్డ సుప్రీంకోర్టు, వాటిని నియంత్రించి, ఇంటర్నెట్ దుర్వినియోగానికి అడ్డుకట్ట వేసేందుకు కొత్త చట్టం తీసుకురావాలని అభిప్రాయపడింది. వివాదాస్పద 'సెక్షన్ 66ఏ'ను రద్దు చేసిన తరువాత ఈ పరిస్థితి ఎక్కువైందని జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ప్రఫుల్ల సి పంత్ లతో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది. సీనియర్ న్యాయవాది ఎల్.నాగేశ్వరరావు, తాను దాఖలు చేసిన పిటిషన్ లో భాగంగా వాదనలు వినిపిస్తూ, తనను ఓ రేప్ కేసులో నిందితుడిగా పేర్కొంటూ, ఇటీవల వాట్స్ యాప్ లో తప్పుడు సందేశం ప్రచారమైందని, దీంతో ఎంతో మంది తనకు ఫోన్ చేసి ప్రశ్నించారని తెలిపారు. మరో న్యాయవాది పరాశరన్ సైతం ఇదే వాదన వినిపించారు. వీరి వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం, సోషల్ మీడియా 'అతి'కి అడ్డుకట్ట పడాల్సిందేనని వ్యాఖ్యానించింది. ఈ మేరకు ప్రభుత్వానికి సిఫార్సులు పంపుతామని తెలిపింది.

  • Loading...

More Telugu News