: పెండింగ్ చలాన్లు ఉంటే హైదరాబాదులోకి రాలేరు, బయటికి పోలేరు!
వేల సంఖ్యలో వాహనదారుల చలాన్లు పెండింగ్ లో ఉండిపోవడంతో, వాటిని వసూలు చేసేందుకు హైదరాబాద్, సైబరాబాద్ పోలీసులు సంయుక్తంగా టోల్ ప్లాజాల వద్ద స్పెషల్ డ్రైవ్ ను చేపట్టనున్నారు. తొలిదశలో శంషాబాద్ విమానాశ్రయ టోల్ ప్లాజా వద్ద నేటి నుంచి ఈ డ్రైవ్ జరగనుంది. టోల్ ప్లాజా వద్దకు వచ్చీపోయే వాహనాల చలాన్లను తనిఖీ చేస్తారు. మూడు కన్నా ఎక్కువ చలాన్లు ఉంటే అక్కడికక్కడే డబ్బు కట్టాల్సి వుంటుంది. లేదంటే, వాహనం పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకుంటారు. ఇందుకోసం టోల్ ప్లాజా వద్ద ప్రత్యేక పోలీస్ పే బూత్ ను కూడా ఏర్పాటు చేశారు. పెండింగ్ చలాన్లు ఉంటే నగరంలోకి రానిచ్చేది లేదని, వాటిని చెల్లించకుండా బయటకు కూడా పోలేరని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. కాగా, రాష్ డ్రైవింగ్, నో పార్కింగ్, సెల్ ఫోన్ డ్రైవింగ్, హెల్మెట్ లేకుండా ప్రయాణం, లేన్ క్రాసింగ్ ఇలా పలు రకాల నిబంధనలు అతిక్రమించి జరిమానాలు చెల్లించకుండా నగరంలో తిరుగుతున్న వాహనాల సంఖ్య లక్షల్లోనే ఉన్నట్టు తెలుస్తోంది.