: "ఆర్ యూ ఓకే?" అని అడిగి ప్రాణాలు నిలిపాడు!
మనిషి జీవితంలో ఎప్పుడు, ఏమి జరుగుతుందో ఊహించలేం! కొన్నిసార్లు కష్టాలు కడలి స్థాయిలో ముంచెత్తుతాయి. దారీతెన్నూ తెలియక వ్యక్తులు చావే శరణ్యమనుకుంటారు. ఆత్మహత్యలు జరిగేది అలానే! ఐర్లాండ్ లోని డబ్లిన్ లో ఓ వ్యక్తి కూడా ఇదే రీతిలో ఆలోచించాడు. తానిక బతకడం వ్యర్థం అని భావించి ఓ వంతెన పైనుంచి దూకి బలవన్మరణానికి సిద్ధపడ్డాడు. అప్పుడక్కడికి జేమీ హారింగ్టన్ అనే 16 ఏళ్ల టీనేజ్ కుర్రాడు రాకుంటే అతడి జీవితం అక్కడితో ముగిసిపోయేది. ఆ కుర్రాడు బ్రిడ్జ్ పైనుంచి దూకాలని భావిస్తున్న వ్యక్తి ముఖంలో కనిపిస్తున్న ఆందోళనను పసిగట్టి "ఆర్ యూ ఓకే? (అలా ఉన్నారేంటి?)" అంటూ అనునయంగా అడిగాడు. ఆ కుర్రాడి గొంతులోని మార్దవం ఆ వ్యక్తికి ఎంతో ఊరటనిచ్చింది. దాంతో, వంతెన అంచు మీద నుంచి దిగి కిందికి వచ్చి, అతడితో 45 నిమిషాల సేపు తన గోడు వెళ్లబోసుకున్నాడు. ఆ విధంగా మనసులోని బరువును దించేసుకున్నాడు. అటుపై ఆ టీనేజర్ ఫోన్ చేయడంతో అక్కడికి వచ్చిన అంబులెన్స్ లో ఆసుపత్రికి వెళ్లి కౌన్సిలింగ్ తీసుకుని ఇంటికి వెళ్లిపోయాడట. ఇప్పుడా వ్యక్తి తనకు పుట్టబోయే బిడ్డకు జేమీ పేరుపెట్టుకోవాలని నిర్ణయించుకోవడం విశేషం. జేమీనే ఈ విషయాన్ని హ్యూమన్స్ ఆఫ్ డబ్లిన్ ఫేస్ బుక్ పేజ్ లో తెలిపాడు. ఈ పోస్టుకు 33 వేలకు పైగా లైకులు వచ్చాయట. వేలాది మంది షేర్ చేసుకున్నారట. దీని గురించి జేమీ మాటల్లోనే విందాం! "మొదట అతడిని చూసినప్పుడు అలా ఉన్నారేంటి? అని అడిగాను. కానీ, అతడి కళ్లు చెప్పేశాయి అతడి పరిస్థితేంటో! నోరు పెగలకపోగా, కళ్లు వర్షించడం ఆరంభించాయి. దాంతో, ఆ వ్యక్తి తీవ్రమైన సమస్యల్లో ఉన్నాడని అర్థం చేసుకున్నాను. వంతెన అంచు పైనుంచి దిగి రావాలని బతిమిలాడాను. కొంతసేపటికి అతడు కిందికి వచ్చి కూర్చున్నాడు. తన కష్టాలన్నీ చెప్పాడు. అనంతరం ఓ ఆసుపత్రికి ఫోన్ చేసి అంబులెన్స్ పిలిపించబోతే వద్దన్నాడు. నేను వెళ్లిపోతే అతడి పరిస్థితేంటని ఆలోచించి అంబులెన్స్ కు ఫోన్ చేసి అతడిని ఆసుపత్రికి పంపాను. ఆ సమయంలోనే ఫోన్ నెంబర్లు ఇచ్చిపుచ్చుకున్నాం. మూడు నెలల తర్వాత ఆ వ్యక్తి ఫోన్ చేసి తన భార్య గర్భవతి అన్న విషయం తెలిపాడు. తాను పలికిన ఆర్ యూ ఓకే? అన్న మూడు పదాలే అతడి ప్రాణం నిలిపాయి. అతడే చెప్పాడీ విషయాన్ని. జేమీ... ఈ పదాలను నీతో ఎవ్వరూ, ఎప్పుడూ అనకుండా ఉంటే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించు! అన్నాడు. అప్పుడు బాగా అర్థమైంది... అతడు ఒంటరితనంతో బాగా కుంగిపోయాడని, దాంతో, నా పలుకులు అతడికి ఆత్మీయ వచనాల్లా తోచాయని!" అని వివరించాడు.