: ఆంధ్ర వారిని విమర్శించే కేసీఆర్... ఆంధ్ర వారికే కాంట్రాక్టులు ఇస్తున్నారు: రేవంత్
రాజకీయ ప్రయోజనాల కోసం ఆంధ్ర వారిని విమర్శిస్తే... తెలంగాణ ప్రజల కడుపు నిండదని టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి రోజూ ఆంధ్ర వారిని తిడతారని... అదే సమయంలో కాంట్రాక్టులను కూడా ఆంధ్ర వారికే కట్టబెడతారని విమర్శించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం కొనుగోలు చేసిన వందలాది కార్లు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కుమారుడి షోరూమ్ లో కొన్నవేనని చెప్పారు. యాదగిరి గుట్ట డిజైన్ ఇచ్చింది కూడా ఆంధ్రకు చెందిన వ్యక్తే అని తెలిపారు. ప్రతి పనిని ఆంధ్ర వారితోనే కలసి చేస్తున్న కేసీఆర్... హైకోర్టు విభజనకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అడ్డొస్తున్నారని ఎలా ఆరోపిస్తారని మండిపడ్డారు. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ గ్రామాన్ని చూస్తే కేసీఆర్ 14 నెలల పాలన ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుందని ఎద్దేవా చేశారు.