: కాంగ్రెస్ ఎంపీల సస్పెన్షన్ పై నన్నెవరూ కలవలేదు: లోక్ సభ స్పీకర్
సస్పెన్షన్ కు గురైన 25 మంది కాంగ్రెస్ ఎంపీల విషయంలో తననెవరూ వచ్చి కలవలేదని స్పీకర్ సుమిత్రా మహాజన్ తెలిపారు. ఏ ఒక్కరు కూడా తనను కలవడంగానీ, ఆ విషయాన్ని తన వద్ద ప్రస్తావించడంగానీ జరగలేదని చెప్పారు. వారిపై సస్పెన్షన్ ఎత్తివేసే అంశం కూడా ఇంతవరకూ తన దృష్టికి కూడా రాలేదన్నారు. అయితే సస్పెన్షన్ పై తాను సుమోటోగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని పార్లమెంట్ ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ సుమిత్రా పేర్కొన్నారు. పార్లమెంట్ సమావేశాలు మొదలైనప్పటి నుంచి లోక్ సభలో ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్ ఎంపీలను ఐదు రోజుల పాటు స్పీకర్ మూడు రోజుల కిందట సస్పెండ్ చేశారు. అయితే వారిపై సస్పెన్షన్ ఎత్తేవేసే ప్రయత్నంలో కేంద్రం ఉందని, చర్చలు కూడా జరుగుతున్నాయని వార్తలు వచ్చాయి.