: టైం బ్యాడ్... తగ్గుతున్న మోదీ ప్రాభవం!
సగర్వంగా భారత ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించి, ప్రజలందరికీ భవిష్యత్తుపై ఆశలను పెంచిన నరేంద్ర మోదీ ప్రాభవం నెమ్మదిగా తగ్గుతోందా? ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే, ఆ మాట నిజమేననిపిస్తోంది. ఏడాదికి పైగా పాలనను పూర్తి చేసుకున్న ఆయన ఆధ్వర్యంలోని ఎన్డీయే ప్రభుత్వం తొలి ఆరు నెలల్లో చూపినంత దూకుడును చూపలేకపోతోంది. ప్రభుత్వ ఐదేళ్ల కాలపరిమితిలో పావు భాగం పూర్తి కాగా, ప్రజల్లో కూడా ఆయనపై ఉన్న ఆశలు తగ్గుతున్నాయి. తాను తీసుకున్న నిర్ణయాలను మోదీ అమలు చేయలేకపోతున్నారు. గత వారంలో వివాదాస్పద భూసేకరణ బిల్లు విషయంలో ఇదే జరిగింది. ఎన్నో సంవత్సరాల నుంచి నలుగుతున్న ఈ బిల్లును ఎలాగైనా అమలు చేయాలన్న మోదీ కృతనిశ్చయం కరిగిపోయింది. కాంగ్రెస్ తదితర విపక్షాలు బిల్లుకు ఎట్టి పరిస్థితిలో మద్దతిచ్చేది లేదని స్పష్టం చేయడంతో, అప్పటికే నాలుగు సార్లు రాష్ట్రపతి ద్వారా ఆర్డినెన్స్ రూపంలో బిల్లును నెట్టుకొచ్చిన మోదీ సర్కారు చేతులెత్తేసింది. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యూపీఏ తీసుకొచ్చిన బిల్లునే ఆమోదించుకుందామని నాలుగైదు మెట్లు కిందకు దిగింది. ఈ ఒక్క విషయమే కాదు, భారత సంస్కృతి, సంప్రదాయాలకు అడ్డుగా నిలుస్తూ, యువతను చెడగొడుతున్నదని భావిస్తున్న అశ్లీల వెబ్ సైట్ల విషయంలో తీసుకున్న నిర్ణయం రెండు రోజుల ముచ్చటగా మిగిలింది. దాదాపు 850కి పైగా శృంగార వెబ్ సైట్లను నిషేధించిన తరువాత ప్రజల నుంచి వచ్చిన విమర్శలకు ఎన్డీయే సర్కారు దిగిరాక తప్పలేదు. నిషేధం విధించిన రెండు రోజుల తరువాత దాన్ని వెనక్కు తీసుకుంటున్నట్టు ప్రకటించాల్సి వచ్చింది. ఇక స్వాతంత్ర్యానంతరం ప్రవేశపెట్టిన అతిపెద్ద పన్ను సంస్కరణ బిల్లుగా గుర్తింపు తెచ్చుకున్న జీఎస్ టీ (గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్) విషయంలోనూ మోదీ సర్కారు ముందడుగు వేయలేకపోయింది. గతంలో కాంగ్రెస్ పార్టీ ఈ బిల్లును తెస్తే, బీజేపీ ఎలా అడ్డుకుందో, ఇప్పుడు అదే పని కాంగ్రెస్ చేస్తోంది. లోక్ సభలో పూర్తి మెజారిటీ ఉన్నప్పటికీ, రాజ్యసభలో మెజారిటీ లేకపోవడం మోదీ ప్రయత్నాలకు ప్రధాన అడ్డంకిగా ఉందని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానించారు. దీనికితోడు తన మంత్రులు వివిధ ఆరోపణల్లో ఇరుక్కోవడం, ముఖ్యమంత్రులపై విమర్శలు, నేతల రెచ్చగొట్టే అడ్డగోలు వ్యాఖ్యలు ఆయన్ను ఆది నుంచి ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి. కేవలం 44 మంది సభ్యులు మాత్రమే ఉన్న కాంగ్రెస్ ప్రతి విషయంలోనూ మోదీని లక్ష్యంగా చేస్తూ, విమర్శలు గుప్పిస్తుంటే, వాటికి ఆయన వద్ద సమాధానం లేకుండా పోతోందని నిపుణులు అంటున్నారు. నరేంద్ర మోదీ కేవలం విదేశీ విధానం, పలు దేశాలతో ద్వైపాక్షిక సంబంధాల మెరుగు విషయంలో మాత్రం ఆయన కొంత విజయం సాధించాడని చెప్పకతప్పదు. మొత్తం మీద "రచ్చగెలిచిన ఆయన ఇంట గెలవలేదు" అనే చెప్పుకోవాలి!