: ఇంకా ఐఎస్ చెరలోనే తెలుగు ప్రొఫెసర్లు... విడిపించేందుకు విదేశాంగ శాఖ ముమ్మర యత్నాలు
లిబియాలో ప్రొఫెసర్లుగా పనిచేస్తున్న హైదరాబాద్ వాసులు బలరాం కిషన్, గోపీకృష్ణల కుబుంబ సభ్యుల్లో నిన్నటి సంతోషం క్షణాల్లోనే మాయమైపోయింది. తమ బందీలుగా ఉన్న తెలుగు ప్రొఫెసర్లను ఐఎస్ ఉగ్రవాదులు విడుదల చేశారని, త్వరలో వారిని హైదరాబాదుకు తరలిస్తామని విదేశాంగ శాఖతో పాటు ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్ రావు నిన్న ప్రకటించారు. దీంతో బలరాం, గోపీల ఇళ్లలో సంతోషం నెలకొంది. అయితే, వారిద్దరినీ ఐఎస్ ఉగ్రవాదులు వదిలిపెట్టలేదన్న వాస్తవం తాజాగా వెలుగుచూసింది. బలరాం, గోపీలు ఇంకా ఐఎస్ చెరలోనే ఉన్నారని, వారిని విడిపించేందుకు తీవ్రంగా యత్నిస్తున్నట్లు లిబియాలోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. ఈ క్రమంలో తాము జరుపుతున్న సంప్రదింపులకు ఉగ్రవాదులు సానుకూలంగా స్పందించారని ఆ కార్యాలయ వర్గాలు తెలిపాయి. అయితే వారింకా ఉగ్రవాదుల చెరలోనే ఉన్నారని తెలిపింది. ఐఎస్ చెర తొలగని విషయం తెలుసుకున్న బలరాం, గోపీల కుటుంబాల్లో మళ్లీ టెన్షన్ మొదలైంది.