: తనయుడిని మరోసారి పబ్లిగ్గా మందలించిన ములాయం
ఉత్తరప్రదేశ్ కు ముఖ్యమంత్రైనా తండ్రికి కొడుకే కదా! మరి, తనయుడిని మందలించే అధికారం తండ్రికి ఎల్లప్పుడూ ఉంటుంది. సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ కూడా అదే రీతిలో కుమారుడు అఖిలేశ్ యాదవ్ ను మందలించారు. వివరాల్లోకెళితే... బుధవారం ఓ కార్యక్రమంలో వేదికపై ములాయం మాట్లాడుతుండగా, ఆయనకు కొంత సమాచారం అవసరమైంది. యూపీలో వరద బాధితులకు కేంద్రం సాయం పెంపు గురించి సీఎం అఖిలేశ్ ను అడిగి తెలుసుకుందామనుకున్నారు. వేదికపై ఉన్న అఖిలేశ్ ను అదే విషయం అడిగారు. అయితే, ఆ సమయంలో పక్కన ఉన్న వారితో మాట్లాడుతున్న అఖిలేశ్ తండ్రి మాట వినిపించుకోలేదు. దాంతో ములాయం ఆగ్రహించారు. తనయుడి తీరుకు సహనం కోల్పోయిన ఆయన వేదికపై పార్టీ నేతలున్నారన్న విషయం కూడా మర్చిపోయి బహిరంగంగానే దుమ్ముదులిపేశారు. తండ్రి ఉగ్రనరసింహావతారం ఎత్తడంతో అఖిలేశ్ నొచ్చుకున్నట్టు తెలిసింది. ములాయం తనయుడిని పబ్లిగ్గా మందలించడం ఇదే మొదటిసారి కాదు. గతేడాది మార్చ్ లోనూ ఇదే రీతిలో క్లాస్ పీకారు.