: మసాలా దట్టించు... ఎక్కువ కాలం 'బండి' లాగించు!


మసాలా దట్టించిన వంటకాలు అధికంగా తినడం ఆరోగ్యానికి మంచిది కాదన్నది నిన్నటిమాట! తాజాగా ఓ అధ్యయనం ఏం చెబుతుందో చూడండి. మసాలా కూరలు రోజూ తినడం వల్ల ఆయుర్దాయం పెరుగుతుందట. చైనీస్ అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పరిశోధకుల నేతృత్వంలోని అంతర్జాతీయ బృందం ఈ విషయమై అధ్యయనం నిర్వహించింది. 'దైనందిన ఆహారంలో మసాలా వంటకాలు, మరణానికి కారణాలు' అన్న అంశంపై చేపట్టిన ఈ స్టడీలో భాగంగా 4,87,375 మందిని పరిశీలించారు. వారిలో 30 ఏళ్ల వారి నుంచి 79 ఏళ్ల వయసున్న వ్యక్తుల వరకు ఉన్నారు. క్యాన్సర్, గుండె జబ్బులు, పక్షవాతం రోగులను ఈ అధ్యయనానికి ఎంపిక చేయలేదు. వయసు, వైవాహిక స్థితి, విద్యా స్థాయి, శారీరక స్థితిగతులను పరిగణనలోకి తీసుకున్నారు. అధ్యయనంలో భాగంగా, రోజూ స్పైసీ ఫుడ్ తీసుకున్న వారికి ... వారానికి ఒకసారి తిన్నవారితో పోల్చితే 14 శాతం ముప్పు తక్కువని తేల్చారు. ఆల్కహాల్ జోలికి వెళ్లకుండా రోజూ మసాలా వంటకాలు తీసుకున్నవారి విషయంలో ఈ ముప్పు మరీ తక్కువని తెలుసుకున్నారు. జీవ క్రియాత్మక పదార్థం కాప్సయిసిన్, యాంటీఆక్సిడాంట్లు, యాంటీ-ఒబేసిటీ పదార్థం, యాంటీ ఇన్ ఫ్లమేషన్, యాంటీ క్యాన్సర్ పదార్థాలు మసాలా దినుసుల్లో ఉంటాయని గత పరిశోధనలోనే గుర్తించారు.

  • Loading...

More Telugu News