: విస్తుగొలిపే నిజాలను వెల్లడించిన పాక్ ఉగ్రవాది ఉస్మాన్ ఖాన్
ప్రాణాలతో పట్టుబడ్డ పాకిస్థాన్ ఉగ్రవాది ఉస్మాన్ ఖాన్ 12 రోజుల క్రితమే భారత్ లో అడుగుపెట్టాడు. ఈ విషయాన్ని జవాన్ల వద్ద స్వయంగా ఒప్పుకున్నాడు. ఉస్మాన్ ను అదుపులోకి తీసుకున్న తర్వాత భారత బలగాలు అతనిపై ప్రశ్నల వర్షం కురిపించాయి. వాటికి సమాధానంగా, కేవలం ఇద్దరం మాత్రమే భారత్ లో అడుగుపెట్టామని ఉస్మాన్ తెలిపాడు. అమర్ నాథ్ యాత్రలో రక్తపాతం సృష్టించడమే తమ లక్ష్యమని... వీలైనంత ఎక్కువ మందిని చంపడమే తమ టార్గెట్ అని చెప్పాడు. బీఎస్ఎఫ్ కాల్పుల్లో మరణించిన మరో ముష్కరుడి పేరు మొమిన్ అని వెల్లడించాడు. కేవలం ప్రతీకారం తీర్చుకోవడానికే తాను భారత్ లో అడుగుపెట్టానని... దేవుడి కర్తవ్యాన్ని తాను నిర్వహిస్తున్నానని ఉస్మాన్ చెప్పాడు. సరిహద్దు దాటి అడవుల గుండా తాము వచ్చామని... మూడు రోజుల్లో తాము తెచ్చుకున్న ఆహార పదార్థాలు అయిపోయాయని.. ఆ తర్వాత ఆహారం కోసం ఒక ఇంటిపై దాడి చేశామని వెల్లడించాడు. ఈ ప్రశ్నలను అడుగుతున్న సమయంలో కూడా ఆహారం కావాలని పోలీసులను ఉస్మాన్ అడగటం గమనార్హం.