: పవన్ కల్యాణ్ ను ఎన్టీఆర్ తో పోల్చిన శివాజీ... పవన్ ముందుకొస్తే ‘హోదా’ వచ్చినట్లేనని వ్యాఖ్య
జనసేన అధినేత, టాలీవుడ్ అగ్ర నటుడు పవన్ కల్యాణ్ వ్యక్తిత్వాన్ని ‘ఏపీకి ప్రత్యేక హోదా సాధన సమితి’ అధ్యక్షుడు, సినీ హీరో శివాజీ సరికొత్తగా అభివర్ణించారు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం ఏలూరులో కొద్దిసేపటి క్రితం సాధన సమితి ఆధ్వర్యంలో రౌంట్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఉద్రేకపూరిత ప్రసంగం చేసిన శివాజీ, ప్రత్యేక హోదా కోసం తాము సాగిస్తున్న పోరులో పవన్ కల్యాణ్ కలిసి వస్తే, కేంద్రం దిగిరాక తప్పదని ఆయన జోస్యం చెప్పారు. రాష్ట్రంలో కుల మతాలకు అతీతంగా అందరివాడుగా ఖ్యాతిగాంచిన వారిలో దివంగత నందమూరి తారకరామారావు అగ్రగణ్యుడని ఆయన చెప్పారు. ఎన్టీఆర్ స్థాయికి పవన్ కల్యాణ్ ఎదిగారని శివాజీ అన్నారు. ప్రస్తుతం పవన్ కల్యాణ్ కు రాష్ట్రంలో కుల మతాలకు అతీతంగా ఆదరణ లభిస్తోందన్నారు. ఈ కారణంగానే ప్రత్యేక హోదా కోసం తాము చేస్తున్న పోరాటంలో పాలుపంచుకోవాలని పవన్ కల్యాణ్ ను కోరుతున్నామని శివాజీ పేర్కొన్నారు. పవన్ కల్యాణ్ రంగంలోకి దిగితే ఏపీకి ప్రత్యేక హోదా వచ్చినట్లేనని శివాజీ విశ్వాసం వ్యక్తం చేశారు.