: పోలవరం పూర్తయితే పట్టిసీమను తొలగిస్తామని మెలిక పెట్టిన ఏపీ ప్రభుత్వం
ఏపీలో తెలుగుదేశం ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పట్టిసీమ ప్రాజెక్టు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఆగస్టు 15వ తేదీ నాటికి ఎట్టి పరిస్థితుల్లో తొలి దశ పనులను పూర్తి చేయాలనే లక్ష్యంతో పనులను కొనసాగిస్తున్నారు. ఇదే సమయంలో, పట్టిసీమ ప్రాజెక్టుపై తెలంగాణ అభ్యంతరాలను లేవనెత్తుతోంది. ఈ క్రమంలో, ఏపీ ప్రభుత్వం దీనిపై తనదైన శైలిలో స్పందించింది. పట్టిసీమ అంతర్ రాష్ట్ర ప్రాజెక్టు కాదని... గోదావరి జలాలు ఇక్కడ నుంచి తెలంగాణకు వెళ్లవని... ఏపీలోనే ప్రవహించి, చివరకు సముద్రంలో కలుస్తాయని తెలిపింది. ఈ క్రమంలో, పట్టిసీమపై ఎవరికీ అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. ఈ మేరకు గోదావరి యాజమాన్య బోర్డుకు వివరణ ఇచ్చింది. పట్టిసీమ అనేది కొత్త ప్రాజెక్టు కాదని... పోలవరంలో అంతర్భాగమని చెప్పింది. ఈ ప్రాజెక్టును తాత్కాలికంగానే నిర్మిస్తున్నామని... పోలవరం పూర్తయిన తర్వాత దీన్ని తొలగిస్తామని తెలిపింది.