: రిషితేశ్వరి డైరీలో ఐదుగురి పేర్లు... వాటిని కొట్టేసి ‘మిస్టర్ ఎక్స్’ అని రాసిందెవరు?


గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఆత్మహత్య చేసుకున్న బీఆర్క్ విద్యార్థిని రిషితేశ్వరి ఘటనలో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. చనిపోయే ముందు తన డైరీలో రిషితేశ్వరి సూసైడ్ నోట్ రాసింది. వర్సిటీలో తాను ఎదుర్కొన్న విపత్కర పరిస్థితులను కూడా రిషితేశ్వరి ఆ డైరీలో రాసుకున్నట్లు తెలుస్తోంది. దాదాపు ఐదు పేజీల్లోని ఆ వివరాలు ఇప్పటిదాకా బయటకు రాలేదు. అంతేకాక, ఆ ఐదు పేజీల్లోని ఓ పేజీలో ఐదుగురు విద్యార్థుల పేర్లున్నాయి. బ్లూ ఇంక్ తో రాసిన సదరు పేర్లను బ్లూ ఇంక్ తోనే కొట్టేసి ఉండటం, వాటిపై ‘మిస్టర్ ఎక్స్’ అని రాసి ఉండటం ఇప్పుడు కలకలం రేపుతోంది. పేర్లను రాసిన రిషితేశ్వరే వాటిని కొట్టివేసి ఉంటే ‘మిస్టర్ ఎక్స్’ అనే పేరును రెడ్ ఇంక్ తో ఎందుకు రాస్తుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రిషితేశ్వరి చనిపోయిన తర్వాత ఆ గదిలోకి ఎవరో ఒకరు వెళ్లి ఉంటారని, వారే ఈ పనికి పాల్పడ్డారన్న అనుమానాలు లేకపోలేదు. ఇదిలా ఉంటే, రిషితేశ్వరి రాసినట్లుగా భావిస్తున్న డైరీని పోలీసులు ఇప్పటిదాకా తమకు కూడా చూపించలేదని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

  • Loading...

More Telugu News