: వంతెనపై వరద నీరే ప్రమాదానికి కారణం... విచారణకు రైల్వే మంత్రి ఆదేశం
మధ్యప్రదేశ్ లోని హర్దాలో నిన్న రాత్రి చోటుచేసుకున్న ఘోర రైలు ప్రమాదానికి కారణం వరద నీరేనని తెలుస్తోంది. ఉత్తర భారతంలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో మాచక్ నదికి వరద నీరు పోటెత్తింది. వంతెనపై ఉన్న రైల్వే ట్రాక్ ను వరద నీరు ముంచెత్తింది. ఈ క్రమంలో వేగంగా దూసుకువచ్చిన కామయాని ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాదానికి గురైంది. ఆ తర్వాత అదే మార్గం మీదుగా వచ్చిన జనతా ఎక్స్ ప్రెస్ బోగీలు కూడా నదిలో పడిపోయాయి. హర్దా సమీపంలో ఇటార్సీ డివిజన్ పరిధిలోని ఖిర్కియా, బిరంగి రైల్వే స్టేషన్ల మధ్య ఈ ప్రమాదం జరిగింది. ఈ మేరకు నిన్న రాత్రే స్పందించిన రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు, వంతెనపై చేరిన వరద నీటి కారణంగానే ప్రమాదం సంభవించి ఉంటుందన్నారు. ప్రమాదంపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన చెప్పారు.