: అందమైన అతివలనే ఆయన చూస్తారు, యావరేజ్ గా ఉంటే చూడరు: సోమనాధ్ భారతిపై భార్య కామెంట్
అందమైన అమ్మాయిలు రాత్రిపూట ఢిల్లీ వీధుల్లో తిరిగే పరిస్థితిని తీసుకొస్తామని వ్యాఖ్యానించిన ఢిల్లీ న్యాయ శాఖ మాజీ మంత్రి సోమనాథ్ భారతి తన భార్య నుంచి ఈ తరహా కామెంట్ వస్తుందని ఊహించి ఉండరు. ఆయనకు అందమైన మహిళలంటేనే మక్కువని, తనవంటి యావరేజ్ మహిళలను ఆయన చూడరని సోమనాధ్ సతీమణి విమర్శించారు. ఆయనతో వివాహం తరువాత తాను ఎంతో ప్రేమను చూపానని, అయితే, ఆయన అందమైన ముఖాల కోసం చూసేవారని, ఇప్పుడు ఆయనిచ్చిన స్టేట్ మెంట్ దాన్నే మరోసారి నిరూపించిందని తెలిపారు. తాను మధ్యస్తంగా ఉండబట్టే ఇబ్బందులు పెట్టారని, తనవంటి యావరేజ్ మహిళలకు స్థానం లేకుండా పోయిందని అన్నారు. ఇదిలా ఉంచితే, తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి వున్నానని సోమనాథ్ భారతి చెప్పారు. కాశ్మీరు నుంచి కన్యాకుమారి వరకూ అందమైన మహిళలు స్వేచ్ఛగా తిరిగినప్పుడే ఇండియాను సురక్షిత దేశంగా చూడవచ్చని చిన్నప్పుడు చదువుకున్నామని, అందుకే, దానిని ఓ సామెతగా వాడానని ఆయన అన్నారు. ఓ మంచి ప్రభుత్వం, రక్షణాత్మక వాతావరణం ఉన్నప్పుడే ఇది సాధ్యమని తెలిపారు.