: వడ్డీల భారం మోయాల్సిందే: ఎస్బీఐ చైర్ పర్సన్ అరుంధతి
వివిధ రుణాల రూపంలో ప్రజలు బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పులపై ఇప్పట్లో వడ్డీ రేట్లను తగ్గించే అవకాశాలు లేవని ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్ పర్సన్ అరుంధతీ భట్టాచార్య అభిప్రాయపడ్డారు. ఆర్బీఐ పరపతి సమీక్ష తరువాత ఆమె స్పందించారు. వడ్డీ రేట్లను తగ్గించే అంశం కేవలం రెపో రేటుపై మాత్రమే ఆధారపడి ఉండదని, ఎన్నో అంశాలను పరిశీలించాల్సి ఉందని వివరించారు. బ్యాంకులిస్తున్న రుణాల మొత్తం గణనీయంగా పెరుగుతోందని తెలిపారు. అందువల్ల రుణగ్రహీతలపై వడ్డీల భారం తప్పదని అన్నారు. ఆర్బీఐ ముప్పావు శాతం వరకూ వడ్డీ రేట్లను పెంచినా, బ్యాంకులు తమ కస్టమర్లకు 0.3 శాతం మాత్రమే ప్రయోజనం చేకూర్చాయని రఘురాం రాజన్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసింది. తమ బ్యాంకు వడ్డీ రేట్లను 0.75 శాతం మేరకు పెంచిన సమయంలోనూ ఖాతాదారులపై 0.3 శాతం భారమే వేసిందని అరుంధతి గుర్తు చేశారు.