: రాజ్ నాథ్ నోరు తెరిపించిన వైసీపీ...ఆలస్యంగా స్పందించినా ఫలితం రాబట్టిన వైనం
ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా, బుల్లెట్ దిగిందా? లేదా? అన్నదే పాయింట్... ఇదీ టాలీవుడ్ హిట్ మూవీలో హీరో మహేశ్ బాబు సూపర్ డైలాగ్. సరిగ్గా ఇదే మాట అంటున్నారు ఏపీలో ప్రతిపక్షం వైసీపీకి చెందిన ఎంపీలు. ఎందుకంటే, ఏపీకి ప్రత్యేక హోదాపై నాలుగు రోజులుగా నిరసనలు కొనసాగుతున్నా, కేంద్రం ఏమాత్రం స్పందించలేదు. ఈ విషయంలో తొలుత టీడీపీ ఎంపీలు పార్లమెంటు ఆవరణలో ఏకంగా నిరసన తెలిపారు. ప్లకార్డులు పట్టి లోక్ సభలోనూ నిరసన తెలిపారు. ఇక కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులు కూడా ఈ విషయంలో తమ వంతు ప్రయత్నం చేశారు. అయినా కేంద్రం నుంచి స్పష్టమైన ప్రకటన రాలేదు. ఇక ఏపీ ప్రత్యేక హోదాపై మాట్లాడటం లేదంటూ విపక్ష వైసీపీపై అన్ని పార్టీలు వేలెత్తి చూపాయి. దీంతో కాస్త ఆలస్యంగానైనా మేల్కొన్న వైసీపీ నేటి లోక్ సభ సమావేశాల్లో ప్రత్యేక హోదాకు సంబంధించి వాయిదా తీర్మానమిచ్చింది. సభలో ఆ పార్టీ ఎంపీలు నినాదాలు చేశారు. దీంతో కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ స్పందించారు. ఏపీతో పాటు తెలంగాణకు కూడా అన్యాయం చేయబోమని భరోసా ఇచ్చారు. న్యాయం చేసి తీరతామని హామీ ఇచ్చారు.