: ఊరించి ఉసూరుమనిపించిన రిజర్వ్ బ్యాంక్
పరపతి విధాన సమీక్షలో భాగంగా వడ్డీ రేట్లు తగ్గిస్తూ ప్రకటన వెలువడుతుందని భావించిన మార్కెట్ వర్గాలకు, ప్రజలకు నిరాశే మిగిలింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తొలి త్రైమాసికం పరపతి సమీక్ష ఊరించి ఉసూరుమనిపించింది. ప్రస్తుతానికి వడ్డీ రేట్లు యథాతథంగా ఉంటాయని ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్ ప్రకటించారు. ద్రవ్యోల్బణాన్ని నిశితంగా పరిశీలిస్తున్నామని, ఏ మాత్రం అవకాశం లభించినా భవిష్యత్తులో వడ్డీ రేట్లు తగ్గిస్తామని తెలిపారు. రెపో రేటు 7.25 శాతం, రివర్స్ రెపో రేటు 6.25 శాతం, నగదు నిల్వల నిష్పత్తి 4 శాతం వద్ద కొనసాగుతాయని ఆయన తెలిపారు. కాగా, ఈ నిర్ణయం మార్కెట్ వర్గాలకు పెద్దగా రుచించలేదు. ఉదయం 11:20 గంటల సమయంలో సెన్సెక్స్ సూచి క్రితం ముగింపుతో పోలిస్తే 85 పాయింట్లు నష్టపోయి 28,102 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.