: ఫిరాయింపుల కేసులో కోర్టు నోటీసు తీసుకునేందుకు టి.స్పీకర్ నిరాకరణ
పార్టీ ఫిరాయింపుల కేసులో హైకోర్టు పంపిన నోటీసు తీసుకునేందుకు స్పీకర్ మధుసూదనాచారి తిరస్కరించారు. ఈ విషయాన్ని న్యాయవాది జంద్యాల రవిశంకర్ కోర్టుకు తెలిపారు. తెలంగాణలో పలు పార్టీల నుంచి టీఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ రాజీనామాపై స్పీకర్ చర్యలు తీసుకోవాలంటూ ఆయా పార్టీల నేతలు హైకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. దానిపై విచారించిన న్యాయస్థానం ఎప్పటిలోగా ఈ అంశంలో చర్యలు తీసుకుంటారంటూ చాలా రోజుల కిందటే స్పీకర్ కు నోటీసు జారీ చేసింది. అయినప్పటికీ స్పీకర్ కు ఇవ్వకపోవడంతో గత నెలలో జరిగిన విచారణ సమయంలో వెంటనే నోటీసును మధుసూదనాచారికి స్వయంగా అందించాలని న్యాయవాదిని ఆదేశించింది. ఈ నేపథ్యంలో రిజిస్టర్ పోస్టు ద్వారా రవిశంకర్ పంపిన లేఖను తీసుకునేందుకు ఆయన నిరాకరించారు.