: భారతదేశంలో ఆడదానిగా పుట్టకూడదు!: యంగ్ ఐఏఎస్ ఆవేదన...సోషల్ మీడియాలో కలకలం
'ఈ దేశంలో ఆడదానిగా పుట్టకూడదని నా ప్రార్థన' అని ఓ మహిళా ఐఏఎస్ ఆఫీసర్ రిజు బఫ్నా ఆవేదన వ్యక్తం చేశారు. 'ఇక్కడ ప్రతి అంగుళానికి ఇడియట్స్ కాచుకుని ఉన్నారు. కనీసం మా బాధలు పట్టించుకునే నాథుడు కూడా కరవయ్యాడు. ప్రతిక్షణం చస్తూ బతకాలిక్కడ' అంటూ తన బాధను వెళ్లగక్కారు మహిళా యువ ఐఏఎస్ అధికారి రిజు. ఫేస్ బుక్ మాధ్యమంగా తనకు జరిగిన అవమానాన్ని ఆమె బాహ్యప్రపంచానికి వెల్లడించారు. మధ్యప్రదేశ్ లో ఆయోగమిత్ర (హ్యూమన్ రైట్స్ కమిషన్) అధికారి సంతోష్ చౌబే అసభ్యకరమైన మెసేజ్ లు పంపడంపై ఛత్తీస్ గఢ్ కేడర్ ఐఏఎస్ అధికారిణి రిజు బఫ్నా పోలీసు కేసు నమోదు చేశారు. ఆగస్టు 1న దీని విచారణ సందర్భంగా, తాను స్టేట్మెంట్ ఇచ్చే సందర్భంలో తనకి అసౌకర్యంగా ఉండడంతో న్యాయస్థానంలో ప్రైవసీ కావాలని, అందర్నీ బయటకు పంపాలని కోరారు. దీంతో న్యాయవాది లలిత్ శర్మ పూనకం వచ్చినట్టు ఊగిపోతూ, 'ఎంత ధైర్యం నీకు, నన్ను బయటకు వెళ్లమనడానికి? నీ ఆఫీసులో నువ్వొక ఆఫీసర్ వి కావచ్చు. కానీ, ఇక్కడ మాత్రం కాదు. నేను ఇక్కడ లాయర్ గా పని చేస్తున్నా' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సమాధానంగా తాను ఐఏఎస్ అధికారిగా ప్రైవసీ అడగడం లేదని, ఒక మహిళగా వ్యక్తిగత స్వేచ్ఛను అడుగుతున్నానని చెప్పినట్టు ఆమె ఫేస్ బుక్ లో పోస్టు చేశారు. దీనిపై సోషల్ మీడియాలో కలకలం రేగింది. సాక్షాత్తూ ఐఏఎస్ అధికారే వేధింపులు ఎదుర్కొంటే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి? అంటూ ప్రశ్నిస్తున్నారు. 'వేధింపులు మన వ్యవస్థలో వేళ్లూనుకున్న రుగ్మతలు' అంటూ నెటిజన్లు విరుచుకుపడుతున్నారు.