: అరుణ్ జైట్లీకి ఘాటుగా సమాధానమిచ్చిన ఆనంద్ శర్మ
అధికారపార్టీ నేతలు మతిమరుపు వ్యాధితో బాధపడుతున్నారని కాంగ్రెస్ నేత ఆనంద్ శర్మ తెలిపారు. రాజ్యసభలో ఆయన మాట్లాడుతూ, బీజేపీ నేతలు గతంలో ప్రతిపక్షంలో ఉండగా చేసిన ఆందోళనలను మర్చిపోయారని మండిపడ్డారు. అధికారం చేపట్టగానే రాజ్యసభ రూల్స్ ను కూడా మర్చిపోయారని ఆయన ఎద్దేవా చేశారు. (కొన్ని సీట్లను చూపిస్తూ) గతంలో ఇవే సీట్లలో కూర్చున్న బీజేపీ నేతలు, సీట్లు మారగానే రూల్ బుక్ ను కూడా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ప్రతిపక్షాల ఆరోపణలపై చర్యలు తీసుకోని కేంద్రం విమర్శలు మాత్రం చేస్తోందని దుయ్యబట్టారు. కేంద్రం చేయాల్సింది చేస్తే, ప్రతిపక్షాలు చేయాల్సింది చేస్తాయని ఆయన స్పష్టం చేశారు. ముందుగా బీజేపీ గతంలో చేసిన ఆందోళనలను, ఆ సందర్భంగా చేసిన డిమాండ్లను గుర్తుచేసుకోవాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా రూల్ బుక్ చూడండంటూ కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ సర్ది చెప్పేందుకు ప్రయత్నించగా, గతాన్ని మర్చిపోకూడదని ఆనంద్ శర్మ కాస్త ఘాటుగానే సమాధానమిచ్చారు. అలాగే కేంద్ర ప్రభుత్వం యూపీఏ ప్రవేశపెట్టిన బిల్లులను మరోసారి ప్రవేశపెట్టడం కాకుండా, కొత్త బిల్లులు ప్రవేశపెట్టేందుకు పనిచేయాలని ఆయన సూచించారు. కాగా, కాంగ్రెస్ పార్టీ పార్లమెంటును అకారణంగా అడ్డుకుంటోందని కేంద్రం ఆరోపించిన సందర్భంగా ఈ వాదన చోటుచేసుకుంది.