: హైదరాబాదు ఖాకీలకు మస్కా కొట్టిన నేరగాడు...బంజారాహిల్స్ పీఎస్ నుంచి పరారీ
హైదరాబాదు పోలీసులకు ఓ ఘరానా మోసగాడు మస్కా కొట్టాడు. పలు నేరాలకు పాల్పడ్డ అతడు ఏకంగా పోలీస్ స్టేషన్ నుంచే పరారయ్యాడు. కాస్త ఆలస్యంగా గుర్తించిన బంజారాహిల్స్ పోలీసులు అతగాడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. వివరాల్లోకెళితే... హైదరాబాదులో పలు నేరాలకు పాల్పడ్డ రాజ్ పుట్ అనే మోసగాడిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదయ్యాయి. దర్యాప్తులో భాగంగా పోలీసులు అతగాడిని ఇటీవలే అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో అతడు నేటి ఉదయం పోలీసుల కళ్లుగప్పి, పోలీస్ స్టేషన్ నుంచి చాకచక్యంగా పరారయ్యాడు. అతడు పరారైన విషయం తెలుసుకున్న బంజారాహిల్స్ పోలీసులు షాక్ తిన్నారు. వెనువెంటనే అతడిని పట్టుకునేందుకు రంగంలోకి దిగారు.