: మోదీపై సోనియా గాంధీ 'డైరెక్ట్ అటాక్'!
ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రత్యక్ష విమర్శలు చేశారు. ఆయన పేరును ప్రస్తావిస్తూ దుయ్యబట్టారు. పార్లమెంటు సజావుగా సాగేందుకు సహకరించాలని ప్రధాని చేసిన విజ్ఞప్తిని ఆమె తోసిపుచ్చారు. దేశంలో పాలన స్తంభించిపోయిందన్న ఆమె, ఎన్నికలకు ముందు మోదీ ఇచ్చిన హామీలను మరచిపోయారని, వాటిల్లో ఏ ఒక్కదాన్నీ నెరవేర్చలేదని అన్నారు. 'మన్ కీ బాత్' చాంపియన్ గా ఉన్న ఆయన, తన సహచరులు జరిపిన కుంభకోణాలపై 'మౌన వ్రతం' పాటిస్తున్నారని విమర్శించారు. పాత పథకాలకు కొత్త రంగు పులమడంలో ఆయనకు ఆయనే సాటని, ఈ విషయంలో నిపుణుడైన సేల్స్ మెన్ గా, తెలివైన న్యూస్ మేనేజర్ గా, పత్రికల హెడ్ లైన్లలో స్థానం సంపాదించే వ్యక్తిగా మోదీ నిలిచారని అన్నారు. తాను నిజాయతీగా ఉంటానని, పారదర్శకత పాటిస్తున్నానని ఒక వైపు చెప్పుకుంటూనే, మరోవైపు తన విదేశాంగ శాఖ మంత్రి, ఇద్దరు ముఖ్యమంత్రుల విషయంలో ఒక్క మాట కూడా మాట్లాడటం లేదని విమర్శించారు. యూపీఏ పాలన సమయంలో 'ముందు రిజైన్ - తరువాతే చర్చ' అన్న నినాదాన్ని తెరపైకి తెచ్చింది బీజేపీయేనని, ఇప్పుడు తాము దాన్నే పాటిస్తున్నామని అన్నారు. తాము ఎంతో ముఖ్యమైన విషయాన్ని బలమైన సాక్ష్యాలతో వినిపించాలని చూస్తుంటే, ప్రభుత్వం ఆ దిశగా ఒక్క అడుగు కూడా వేయడం లేదని నిప్పులు చెరిగారు.