: ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ తో తెలుగు టెలివిజన్ టెక్నీషియన్స్ చర్చలు సఫలం... సమ్మె విరమణ
వేతనాల పెంపు డిమాండ్ తో ఆందోళన బాట పట్టిన తెలుగు టెలివిజన్ వర్కర్స్ సమస్య పరిష్కారమైంది. ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ తో తెలుగు టెలివిజన్ టెక్నీషియన్స్, వర్కర్స్ ఫెడరేషన్ జరిపిన చర్చలు సఫలమయ్యాయి. వేతనాల పెంపు, నిర్ణీత పనివేళలపై ఈ రోజు జరిపిన చర్చల్లో ఒప్పందం కుదిరింది. ఈ మేరకు వేతన సవరణకు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అంగీకరించింది. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 9 వరకు పనిచేసేవారికి 10 నుంచి 20 శాతం వేతనం పెంచేందుకు ఒప్పుకుంది. అదనంగా పనిచేసేవారికి కూడా గంటకు వంద రూపాయల చొప్పున ఇస్తామని చెప్పింది. దాంతో టెలివిజన్ టెక్నీషియన్స్, వర్కర్స్ సంతోషం వ్యక్తం చేశారు. జీతాలు పెంచేందుకు అంగీకరించిన నిర్మాతలకు కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు ఇప్పటివరకు ఆగిన సీరియల్ షూటింగ్ లు వెంటనే మొదలుకానున్నాయి.