: భారత్ కాదంటే ఇంకో దేశాన్ని చూసుకుంటాం: పీసీబీ
ఉగ్రదాడుల నేపథ్యంలో, ఇప్పట్లో పాకిస్థాన్ తో క్రికెట్ ఆడే ప్రసక్తే లేదని బీసీసీఐ తేల్చి చెప్పడంతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కంగుతింది. భారత్ సిరీస్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్న పీసీబీ చివరకు తీవ్ర నిరాశకు గురైంది. భారత్ తో క్రికెట్ ఆడితే భారీ ఎత్తున ఆదాయం ఉంటుందని భావించిన పీసీబీకి బీసీసీఐ నిర్ణయం మింగుడు పడటం లేదు. భారత్ మినహా ఇతర ఏ దేశంతో ఆడినా పాక్ క్రికెట్ బోర్డుకు కాసుల వర్షం కురవదు. ఈ నేపథ్యంలో, ఇప్పటికే లోటు బడ్జెట్ తో కొట్టుమిట్టాడుతున్న పీసీబీకి... ద్వైపాక్షిక సిరీస్ కు బీసీసీఐ ఓకే చెప్పడంతో, వెయ్యి ఏనుగుల బలం వచ్చింది. అయితే, ఉగ్రదాడులు పీసీబీ ఆశలపై నీళ్లు చల్లాయి. ఈ క్రమంలో, పీసీబీ ఛైర్మన్ షహర్యార్ ఖాన్ మాట్లాడుతూ, తమతో సిరీస్ కు బీసీసీఐ ఒప్పుకుంటుందనే ఆశ ఇంకా తమలో ఉందని చెప్పారు. ఒకవేళ బీసీసీఐ ఒప్పుకోకపోతే, ప్రత్యామ్నాయంగా అదే సమయంలో మరో దేశంతో సిరీస్ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నామని చెప్పారు. ఇప్పటికే ఈ విషయంపై ఇతర బోర్డులతో చర్చిస్తున్నామని తెలిపారు.