: 18 గంటల ఎడతెగని వర్షంతో 18 లక్షల మంది నిరాశ్రయులు!
పశ్చిమ బెంగాల్ ప్రజలను భారీ వర్షాలు, ఆ వెనుకే వచ్చిన వరదలు తీవ్ర ఇబ్బందులు పెడుతున్నాయి. గడచిన 18 గంటలుగా ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తుండడంతో, రాష్ట్రంలోని 13 జిల్లాల్లో జనజీవనం అతలాకుతలమైంది. దక్షిణ బెంగాల్ పై వరదల ప్రభావం అధికంగా ఉంది. సుమారు 18 లక్షల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. రాత్రంతా కుండపోత వర్షం కురుస్తునే ఉండడంతో, దాని ప్రభావం ఏంటన్నది తెల్లారిన తరువాతనే ప్రజలకు తెలిసింది. చుట్టూ ఎటుచూసినా నీటితో నిండిపోగా, పలు చోట్ల జాతీయ రహదారులపై ఐదు నుంచి పదడుగుల ఎత్తునకు నీరు చేరింది. భారీ వర్షాలు కురుస్తాయన్న సమాచారాన్ని ముందుగానే తెలుసుకున్న ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తన లండన్ పర్యటనను కుదించుకుని వచ్చి పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె కేంద్రంపై విరుచుకు పడ్డారు. కొండ చరియలు విరిగిపడ్డ డార్జిలింగ్ ప్రాంతానికి కేంద్రం ఏమైనా సాయం పంపిందా? అని ప్రశ్నించారు. సాయపడాలని తామేమీ కేంద్రాన్ని అడ్డుకోబోమని, వరద ప్రభావిత ప్రాంతాల్లో తక్షణ సహాయక చర్యల నిమిత్తం సొంత వనరులను వాడుకుంటున్నామని తెలిపారు.