: భారత్ లో స్కూళ్ల కంటే వీటి సంఖ్యే ఎక్కువ!
దేశంలోని 26 రాష్ట్రాల్లో 31 లక్షలకు పైగా స్వచ్ఛంద సేవాసంస్థలు (ఎన్జీవోలు) ఉన్నాయని సీబీఐ నివేదిక చెబుతోంది. ఈ మేరకు సుప్రీం కోర్టుకు సీబీఐ శుక్రవారం అఫిడవిట్ అందించింది. దేశంలో ఉన్న స్కూళ్ల సంఖ్య కంటే ఎన్జీవోలే అధిక సంఖ్యలో ఉన్నాయని పేర్కొంది. తెలంగాణ, ఒడిశా, కర్ణాటక రాష్ట్రాల్లో ఉన్న ఎన్జీవోల సంఖ్యపై వివరాలు అందాల్సి ఉందని సీబీఐ తెలిపింది. ఇవే కాకుండా, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 82,000కి పైగా స్వచ్ఛంద సంస్థలు రిజిస్టర్ అయినట్టు వివరించింది. 2011 ప్రణాళిక సంఘం లెక్కల మేరకు దేశంలో 15 లక్షల వరకు పాఠశాలలు ఉన్నాయి. ఆ లెక్కన చూస్తే ఎన్జీవోలు (31 లక్షలు) రెట్టింపు సంఖ్యలో ఉన్నట్టే. ఇది దేశంలో ఉన్న ప్రభుత్వాసుపత్రుల సంఖ్యకు 250 రెట్లు ఎక్కువంటేనే అర్థమవుతోంది, సేవా సంస్థలు ఏ రీతిలో వెలుస్తున్నాయో! దేశంలో 709 మంది పౌరులకు ఒక పోలీసు కానిస్టేబుల్ ఉంటే, 400 మంది పౌరులకు ఒక ఎన్జీవో ఉందని సీబీఐ నివేదిక వివరిస్తోంది. దేశంలోని ఎన్జీవోల పనితీరుపై సమగ్ర నివేదిక ఇవ్వాలంటూ సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు సీబీఐ ఈ అఫిడవిట్ సమర్పించింది.