: ఏపీకి ప్రత్యేక హోదా రాదని చంద్రబాబుకు కూడా అవగతమైంది: జేసీ దివాకర్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాపై ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి విజయవాడలో సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాదని సీఎం చంద్రబాబుకు ఎప్పుడో అవగతమైందన్నారు. అందుకే అదనంగా నిధులు తెచ్చుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆయన విశ్వప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రత్యేక హోదా రావాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు కూడా ఉందని, అందుకే టీడీపీ వాళ్లు, ఎంపీలు ప్రయత్నించడం లేదన్నారన్నారు. ఆయన చెప్పినట్టుగా తాము లోక్ సభ లోపల, బయట ఆందోళన చేశామన్నారు. అంతకంటే తామేం చేయగలమన్నారు. హోదా కోసం పవన్ ముందుకొస్తే ఆయనవెంట నడిచేందుకు తాము సిద్ధమని చెప్పారు. అయితే తాజాగా ప్రత్యేక హోదాపై కేంద్రం వైఖరి స్పష్టమైందన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, లేనప్పుడు ఒకమాట చెబుతున్నారని జేసీ పరోక్షంగా బీజేపీని విమర్శించారు. ఇక ప్రత్యేక హోదాపై ధర్నాలు, దీక్షలంటూ వైఎస్ జగన్ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు.