: భారత భద్రత డొల్లతనాన్ని బయటపెట్టిన పాకిస్థాన్ మహిళ


గుర్ దాస్ పూర్ ఘటన నేపథ్యంలో సరిహద్దు భద్రతపై పలు సందేహాలు రేకెత్తుతున్న క్రమంలో తాజాగా, ఓ పాకిస్థానీ మహిళ పాస్ పోర్ట్, వీసా, టికెట్ లేకుండా భారత్ లో సులువుగా ప్రవేశంచడం భారత భద్రత డొల్లతనాన్ని సూచిస్తోంది. చందా ఖాన్ (27) అనే మహిళ పాకిస్థాన్ లోని కరాచీ నుంచి భారత్ చేరుకుంది. వీసా, పాస్ పోర్ట్, టికెట్ లేకుండా సంఝౌతా ఎక్స్ ప్రెస్ లో భారత్ వచ్చిన ఆమెను జలంధర్ రైల్వే స్టేషన్ దగ్గర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆమెను అంతారీ పోలీస్ స్టేషన్ కు తరలించి, విచారించారు. ఈ సందర్భంగా ఆమె రెండు, మూడు కథలను వినిపించింది. తొలుత తన బంధువు దగ్గర పాస్ పోర్ట్, వీసా, టికెట్ ఉన్నాయని, ఆయన కనిపించడం లేదని చెప్పింది. ఆయన కోసం వెతికిన పోలీసులకు ఆమె అబద్ధం చెప్పిందని తేలింది. అనంతరం తాను సల్మాన్ ఖాన్ వీరాభిమానని, తన బంధువు సల్మాన్ బిగ్ బాస్ సెట్ లో పని చేశాడని, అతను సల్మాన్ ను చూపిస్తానంటే వచ్చానని చెప్పింది. తరువాత తన భర్త పేరు సల్మాన్ ఖాన్ అని అందుకే సల్మాన్ ను చూడాలనుకున్నానని తెలిపింది. ఇలా పొంతన లేని సమాధానాలు చెప్పడంతో పోలీసులు విచారణ చేబట్టారు. ఆమె బ్యాగులో కొన్ని మందులు, ప్రిస్క్రిప్షన్, 771 రూపాయల పాకిస్థాన్ కరెన్సీ ఉన్నాయి. దీంతో ఆమెను న్యాయస్ధానంలో హాజరుపరిచిన పోలీసులు రెండు రోజుల కస్టడీకి తీసుకున్నారు. కాగా, ఆమె అక్రమ ప్రవేశం పలు ప్రశ్నలను రేకెత్తిస్తోంది. భారత్ లో ప్రవేశించడం ఇంత సులువా? అనిపిస్తోందని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ఇదే రీతిన ఐఎస్ఐఎస్ వంటి తీవ్రవాదులు ప్రవేశిస్తే ఎంత ప్రమాదం? అని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News