: మరణశిక్ష రద్దు చేయాలంటూ రాజ్యసభలో ప్రైవేట్ మెంబర్ తీర్మానం


ముంబయి పేలుళ్ల దోషి యాకూబ్ మెమన్ ను ఉరితీయడంతో దేశంలో ఒక్కసారిగా మరణశిక్షపై చర్చకు తెరలేచింది. ఈ నేపథ్యంలో దేశంలో మరణశిక్ష రద్దు చేయాలంటూ సీపీఐ నేత డి.రాజా రాజ్యసభలో ఈరోజు ప్రైవేట్ మెంబర్ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. నేషనల్ లా యూనివర్సిటీ స్టూడెంట్స్ స్టడీ ప్రకారం, ఉగ్రవాదానికి సంబంధించి మరణశిక్షకు గురవుతున్న వారిలో 94 శాతం మంది దళిత కులాల లేదా మైనారిటీలకు చెందినవారే ఉన్నారని రాజా ప్రవేశపెట్టిన తీర్మానం పేర్కొంటోంది. గతంలోనూ పలు కేసుల్లో మరణశిక్షను వ్యతిరేకించిన రాజా, యాకూబ్ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్ ను పరిశీలించాలంటూ సంతకాలు పెట్టిన వారిలో ఆయనొకరు. అయితే కన్నుకు కన్ను అనేది భారత న్యాయ సిద్ధాంతంలో భాగం కాదని ఆయన పేర్కొన్నారు. మరణశిక్ష చట్టంపై ప్రభుత్వం, పార్లమెంట్ నిర్ణయం తీసుకునే వరకు ఆ శిక్షకు దేశం 'నో' చెప్పాలన్నారు. అంతవరకు మరణశిక్షపై మన దేశం తాత్కాలిక నిషేధాన్ని విధించాలని కోరారు.

  • Loading...

More Telugu News