: ఇంటర్నేషనల్ జ్యూయలరీ వీక్ లో కనువిందు చేయనున్న సానియా
భారత టెన్నిస్ రారాణి సానియా మీర్జా అప్పుడప్పుడు ఆటవిడుపుగా మోడలింగ్ ర్యాంప్ పై కాంతులీనుతుంటుంది. ఇటీవలే వింబుల్డన్ నెగ్గి కెరీర్ లోనే మధురమైన ఘనత సొంతం చేసుకున్న ఈ హైదరాబాదీ భామ ప్రస్తుతం పలు కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇటీవలే భర్త షోయబ్ మాలిక్ కోసం సానియా శ్రీలంక వెళ్లడం తెలిసిందే. కాగా, ఆగస్టు 3న ముంబయిలో జరిగే 'ది ఇండియా ఇంటర్నేషనల్ జ్యూయలరీ వీక్' లో సానియా తళుకుబెళుకులు ప్రదర్శించనుంది. ఈ షోలో సానియా... మోనీ అగర్వాల్ డిజైన్ చేసిన 'జొరాక్షి' సిరీస్ ఆభరణాలను ధరించి కనువిందు చేయనుంది. ప్రపంచంలోని అత్యద్భుతమనదగ్గ పుష్పాలను తలపించేలా ఈ నగలను మోనీ అగర్వాల్ డిజైన్ చేశారు.