: సీల్డు కవర్లో ఏముందో వెల్లడించేందుకు టెల్కోలు ససేమిరా!
ఈ ఉదయం విజయవాడ కోర్టుకు కాల్ డేటా వివరాలను సీల్డ్ కవర్లో సమర్పించిన టెలికం కంపెనీలు వాటిల్లో ఏముందన్న విషయాన్ని వెల్లడించేందుకు మాత్రం నిరాకరించాయి. సీల్డ్ కవర్లో ఏముందో తెలియజేస్తూ, నోట్ ఫైల్ ఇవ్వాలని ఏపీ సీఐడీ, సిట్ తరపు న్యాయవాదులు వాదించగా, తాము సుప్రీంకోర్టు సూచనల మేరకు సీల్డ్ కవర్లో వివరాలు అందించామని, దానిలో ఏముందో చెప్పే సమస్యే లేదని టెల్కోల తరపు న్యాయవాదులు స్పష్టం చేశారు. నోట్ ఫైల్ ఇవ్వబోమని తేల్చి చెప్పారు. కాగా, ఈ సీల్డ్ కవర్ కాల్ డేటా వివరాలను ప్రత్యేక దూత ద్వారా హైకోర్టు రిజిస్ట్రార్ వద్దకు పంపాలని, నిన్న తీర్పు వెలువడిన సంగతి తెలిసిందే. రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసు వెలుగులోకి వచ్చిన తరువాత, ఏపీ ముఖ్యమంత్రి సహా మంత్రులు, అధికారుల ఫోన్లను ట్యాప్ చేశారని కేసులు నమోదయ్యాయి. పలువురు టీఆర్ఎస్ నేతలు తమ పార్టీ వారితో మాట్లాడి ప్రలోభాలకు గురి చేశారని ఆరోపిస్తూ, అందరి కాల్ డేటానూ ఇవ్వాలని కోరింది. టెల్కోలు అందుకు నిరాకరించడంతో కేసు కోర్టు మెట్లెక్కగా, చివరికి సుప్రీం జోక్యంతో నేతలు చేసిన, రిసీవ్ చేసుకున్న కాల్స్ సమాచారం ఇలా సీల్డ్ కవర్లోకి ఎక్కింది. ఈ కవర్లో ఏపీ సిట్ అధికారులు కోరిన విధంగా పలువురు టీఆర్ఎస్ నేతల సెల్ ఫోన్ కాల్స్ డేటా వివరాలు ఉండే అవకాశాలున్నాయి. దీంతో టీఆర్ఎస్ నేతలు సైతం ఆందోళనకు గురవుతున్నారు.