: సింహాద్రి అప్పన్న ప్రసాదంలో పురుగులు... అధికారులపై మంత్రి గంటా ఆగ్రహం
సింహాచలం లక్ష్మీనరసింహ స్వామి వారి ప్రసాదంలో పురుగులు బయటపడ్డాయి. విశాఖ జిల్లాలోని సింహాచలం సన్నిధికి నేడు గురు పౌర్ణమి సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. గుడిలో గిరిప్రదక్షిణలు పూర్తి చేసుకున్న భక్తులు స్వామి వారి ప్రసాదం లడ్డూల ప్యాకెట్లను తీసుకున్నారు. వాటిని విప్పిచూడగా పురుగులు వెలుగు చూడటంతో భక్తులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. దీనిపై సమాచారం అందుకున్న ఏపీ మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆలయ అధికారులను వివరణ కోరారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన తీరుపై ఆయన అధికారుల తలంటారు. ఇకపై ప్రసాదం తయారీలో నాణ్యతా ప్రమాణాలను పాటించాలని, లడ్డూలను పూర్తి స్థాయిలో పరీక్షించిన తర్వాతే పంపిణీ చేయాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు.