: పవన్ కల్యాణ్ ను ప్రశ్నించిన శివాజీ!
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా సాధన సమాఖ్య అధ్యక్షుడు, సినీ నటుడు శివాజీ ప్రశ్నించారు. హైదరాబాదులో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాపై జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీ వద్దకు మనం వెళ్లాల్సిన అవసరం లేదని అన్నారు. ఎన్నికల సందర్భంగా ప్రధాని మోదీకి మద్దతిచ్చింది మనం అని, ట్వీట్లు చేయడం మానేసి రోడ్డుమీదికి రావాలని ఆయన పిలుపునిచ్చారు. పవన్ కల్యాణ్ రోడ్డు మీదికి వస్తే కేవలం ఐదు నిమిషాల్లో పనైపోతుందని శివాజీ అభిప్రాయపడ్డారు. ఎంపీలను తిట్టడం సబబేనన్న ఆయన, అయితే, ఎవర్నో తిట్టాల్సిన అవసరం లేదని, మోదీనే నిలదీద్దాం రావాలని శివాజీ, పవన్ కల్యాణ్ కు సూచించారు. వైఎస్సార్సీపీ నేతలు ఎవర్ని ఉద్ధరించడానికి ఢిల్లీలోని జంతర్ మతర్ వద్ద ధర్నా చేయడానికి వెళ్తున్నారని శివాజీ ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమం సందర్భంగా ఇద్దరు టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంటును ఆడించారని గుర్తు చేశాడు. టీడీపీ నేతలు ఆందోళన చేయాలంటేనే భయపడిపోతున్నారని శివాజీ ఎద్దేవా చేశాడు. కేంద్రానికి ఎదురెళ్తే...కేసులు బయటికి తీస్తారని అంతా భయపడిపోతున్నారని ఆయన మండిపడ్డాడు. తెలంగాణ ఉద్యమం సందర్భంగా సమైక్యాంధ్ర అంటూ ప్రజలను మభ్యపెట్టిన రాజకీయ నాయకులు మరోసారి వారిని మోసం చేసేందుకు సిద్ధమవుతున్నారని శివాజీ హెచ్చరించాడు. అన్ని వర్గాల ప్రజలు ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాపై సమరం సాగించాల్సిన అవసరం ఉందని శివాజీ పిలుపునిచ్చాడు.