: బోర్డుతో విభేదాలున్నా కుర్రాళ్ల కోసం ముందుకొచ్చాడు!
"ఓపెన్ మైండెడ్"... పాకిస్థాన్ పేస్ దిగ్గజం వసీం అక్రమ్ పై క్రికెట్ ప్రపంచం అభిప్రాయమిది. తాను పాకిస్థానీ అయినా, ఏ దేశానికి చెందిన క్రికెటర్లు సలహాలు అడిగినా కాదనడు. తనకు తెలిసిన స్వింగ్ పరిజ్ఞానాన్ని ఇతరులతో పంచుకునేందుకు సదా ముందుంటాడు. పేరెన్నికగన్న ఎందరో ఫాస్ట్ బౌలర్లు అక్రమ్ నేర్పిన చిట్కాలు సత్ఫలితాలనిచ్చాయని ఏదో ఒక సందర్భంలో చెబుతుంటారు. ప్రస్తుతం పాకిస్థాన్ జాతీయ పేసర్లుగా వెలుగొందుతున్న వహాబ్ రియాజ్, జునైద్, మహ్మద్ ఇర్ఫాన్, సొహైల్ ఖాన్ తదితరులు అక్రమ్ శిష్యరికంలో రాటుదేలినవాళ్లే. పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తో విభేదాలున్నా కుర్రాళ్లకు శిక్షణ అనేసరికి అవన్నీ మర్చిపోతాడీ స్వింగ్ సుల్తాన్. తాజాగా, కరాచీలో జరిగే ఓ పేస్ క్యాంపులో అక్రమ్ 12 మంది మెరికల్లాంటి ఫాస్ట్ బౌలర్లకు శిక్షణ ఇచ్చేందుకు అంగీకరించాడు. 12 రోజుల పాటు జరిగే ఈ శిక్షణ శిబిరంలో పాల్గొనే యువ బౌలర్ల జాబితాను పీసీబీ గురువారం ప్రకటించింది. ఆగస్టు 1 నుంచి జరిగే ఈ ట్రైనింగ్ క్యాంపుకు కరాచీలోని నేషనల్ స్టేడియం ఆతిథ్యమిస్తోంది. కాగా, ఈ కుర్రాళ్లను దేశంలోని నాలుగు కేంద్రాల్లో నిర్వహించిన ట్రయల్స్ ద్వారా ఎంపిక చేశారు. అక్రమ్ ఇలాగే 2013లోనూ ఓ శిక్షణ శిబిరంలో కుర్రాళ్లకు సానబట్టాడు. జునైద్, ఇర్ఫాన్, సొహైల్, రియాజ్ వంటి పేసర్లు ఆ శిబిరంలో శిక్షణ పొందినవాళ్లే కావడం విశేషం. అయితే, ఇటీవల పీసీబీ నిర్ణయాలను అక్రమ్ ప్రశ్నిస్తుండడంతో వాతావరణం కాస్త వాడీవేడిగా మారింది. కానీ, అక్రమ్ తోనే ఈ శిబిరంలో శిక్షణ ఇప్పించాలని ఓ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ పట్టుబట్టింది. అక్రమ్ కు తామే నేరుగా పారితోషికం చెల్లిస్తామని, శిబిరాన్ని స్పాన్సర్ చేస్తామని సదరు సంస్థ స్పష్టం చేసింది. ఈ టాలెంట్ హంట్ పథకానికి అక్రమ్ నేతృత్వం వహిస్తేనే తాము స్పాన్సర్ చేస్తామని సదరు సంస్థ పీసీబీకి తేల్చి చెప్పింది. దాంతో, అక్రమ్ తో శిబిరానికి పీసీబీ ఓకే చెప్పినట్టు అర్థమవుతోంది.