: అక్కడి ఖైదీలు తయారు చేసిన ఉరితాడుతో ఇక్కడి దోషికి ఉరి!
ముంబై పేలుళ్ల కేసులో ఉరిశిక్ష పడ్డ యాకూబ్ మెమన్ కు శిక్ష అమలు చేయడానికి వినియోగించిన ఉరితాడును ఎక్కడ, ఎలా తయారు చేశారన్న విషయాన్ని నాగపూర్ జైలు అధికారులు వివరించారు. బీహార్ లోని బుక్సార్ కేంద్ర కర్మాగారంలో దీన్ని తయారుచేశారు. తమ జైల్లో తయారైన ఉరితాడును నాగపూర్ కు పంపినట్టు బుక్సాల్ జైలు సూపరింటెండెంట్ ఎస్.కే.చౌదరి వెల్లడించారు. జైల్లోని ఖైదీలు ఈ ఉరితాడును తయారు చేశారని తెలియజేశారు. 14 సంవత్సరాల బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన ధనుంజయ్ చటర్జీని ఉరితీసేందుకు కోల్ కతా జైలు అధికారుల కోరిక మేరకు అప్పట్లో ఇదే తరహా ఉరితాడును పంపామని, ఆపై అఫ్జల్ గురు, అజ్మల్ కసబ్ లను ఉరితీసేందుకు వినియోగించిన తాళ్లను కూడా ఇక్కడి ఖైదీల చేతనే తయారు చేయించామని ఆయన వివరించారు. మేలిరకం జే-34 పత్తిని వాడి దీన్ని తయారు చేశామని, ఆ తరువాత తాడు మెత్తగా ఉండేందుకు మైనం, అరటి గుజ్జు తదితరాలను వాడామని ఆయన తెలిపారు. తాడులో ఎక్కడా ముడులు ఉండకుండా జాగ్రత్త పడ్డామని వివరించారు.