: 'గెలాక్సీ ఎస్-6' విఫలం: అంగీకరించిన శాంసంగ్
ఎన్నో ఆశలతో శాంసంగ్ విడుదల చేసిన గెలాక్సీ ఎస్-6 కస్టమర్లను మెప్పించడంలో విఫలమైంది. గెలాక్సీ సిరీస్ లో వచ్చిన ఎస్6 అమ్మకాలు నిరుత్సాహకరంగా ఉండడంతో సంస్థ ఆర్థిక ఫలితాలపై స్పష్టమైన ప్రభావం కనిపించింది. ఏప్రిల్ - జూన్ మధ్య కాలంలో సంస్థ గణాంకాలను నేడు ప్రకటించగా, ఆదాయం 8 శాతం తగ్గింది. ఇదే సమయంలో మొబైల్ వ్యాపారంపై వచ్చిన రెవెన్యూ ఏకంగా 38 శాతం తగ్గింది. ఈ మూడు నెలల్లో స్మార్ట్ ఫోన్లు గెలాక్సీ ఎస్6, ఎస్6 ఎడ్జ్ విక్రయాలు తాము ఊహించిన అంచనాలకు తగ్గట్టుగా లేవని సంస్థ వైస్ ప్రెసిడెంట్ పార్క్ జిన్యాంగ్ వివరించారు. శాంసంగ్ త్రైమాసిక గణాంకాల్లో లాభాల్లో క్షీణత నమోదు కావడం ఇది వరుసగా ఐదో సారి. అందువల్లే మొబైల్ విభాగం నుంచి వచ్చే లాభంలో 60 శాతం కోల్పోయామని ఆయన అన్నారు. మార్కెట్లో చైనా ఉత్పత్తులు తక్కువ ధరల్లో లభిస్తుండటం, యాపిల్ సరికొత్త ఫోన్ మోడల్ కోసం కస్టమర్లు ఎదురుచూస్తుండటం తమపై ప్రభావం చూపాయని ఆయన అన్నారు. ఇదే సమయంలో సంస్థ సెమీ కండక్టర్ విభాగం అద్భుత ప్రతిభను చూపి చాలా సంవత్సరాల తరువాత 3 ట్రిలియన్ యువాన్ ల ఆదాయాన్ని నమోదు చేసింది. ఈ ఆదాయం లేకుంటే సంస్థ నికర లాభాలు మరింతగా తగ్గేవి. కాగా, ఈ ఫలితాలు మార్కెట్ ఇన్వెస్టర్లపై ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. ఆర్థిక ఫలితాల ప్రకటన తరువాత శాంసంగ్ ఈక్విటీ వాటాల విలువ ఏకంగా 3 శాతం పడిపోయింది.