: 1993 మార్చ్ 12... భరతజాతి చరిత్రలో దుర్దినం!


ప్రపంచంలో ఉగ్రవాద విషసర్పం ఇంకా బుసలు కొడుతూనే ఉంది. భూమండలంపై ఏదో ఒక మూల తీవ్రవాదం తాలూకు ప్రభావం ప్రజలపై కనిపిస్తూనే ఉంది. ఆ విషకోరల్లో చిక్కుకున్న కొన్ని దేశాలు ఇప్పటికీ కోలుకోలేదంటే ఆ విపరీతవాదం ప్రభావం ఎలాంటిదో సులువుగానే అర్థం చేసుకోవచ్చు. టెర్రరిజం కారణంగా అత్యధికంగా నష్టపోతున్న దేశాల్లో భారత్ కూడా ఒకటి. 1993 మార్చ్ 12న ముంబయి నగరంలో చోటుచేసుకున్న విధ్వంసకాండ జాతి చరిత్రలో ఓ విషాదఘట్టం. వరుసగా సంభవించిన బాంబు పేలుళ్ల కారణంగా 257 మంది మరణించగా, 700 మందికి పైగా గాయపడ్డారు. ఈ నరమేధంతో దేశం ఉలిక్కిపడింది. ఏం జరుగుతుందో అర్థంకాని స్థితిలో ఆనాడు ముంబయి మహానగరం తల్లడిల్లిపోయింది. ఆ ఘటనలో కీలకపాత్ర పోషించిన యాకూబ్ మెమన్ కు ఉరిశిక్ష నేపథ్యంలో... ఆ రోజున అసలేం జరిగిందో అవలోకిస్తే... ఎప్పట్లానే ముంబయి ప్రజలు తమ దైనందిన కార్యక్రమాలతో బిజీగా ఉన్న క్షణాలవి. తమను ఉగ్రభూతం తరుముకొస్తోందని తెలియని స్థితిలో ఆ అమాయకులు ఎవరి పనుల్లో వారు ఉన్నారు. మధ్యాహ్నం 1.30 గంటల వేళ... బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ బిల్డింగ్ బేస్ మెంట్ వద్ద తొలి పేలుడు సంభవించింది. కారు బాంబుతో అక్కడ విధ్వంసం సృష్టించారు ముష్కరులు. 28 అంతస్తుల ఆ బిల్డింగ్ బాంబు పేలుడు ధాటికి తీవ్రంగా దెబ్బతిన్నది. 50 మంది వరకు చనిపోయారు. అది మొదలు... మధ్యాహ్నం 3.40 గంటల వరకు ముంబయి నగరం పేలుళ్లతో దద్దరిల్లిపోయింది. కారు బాంబులు, స్కూటర్ బాంబుల విస్ఫోటనాలతో ప్రజలు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. దురదృష్టవంతులు ఆ పేలుళ్లలో ప్రాణాలు విడిచారు. మాహిం కాజ్ వే ప్రాంతంలోని ఫిషర్ మెన్ కాలనీ, జావేరి బజార్, ప్లాజా సినిమా, సెంచరీ బజార్, కాఠా బజార్, సీ రాక్ హోటల్, ఎయిరిండియా బిల్డింగ్, హోటల్ జుహూ సెంటౌర్, వర్లీ, పాస్ పోర్ట్ ఆఫీస్ వద్ద మృత్యువు విలయతాండవం చేసింది. తేరుకున్న అధికార గణం ఆపై సహాయక చర్యలకు ఉపక్రమించింది. ఎక్కడ చూసినా శవాలే! కన్నవారిని కోల్పోయిన చిన్నారులు, కడుపున పుట్టినవారు కానరాని లోకాలకు వెళ్లారన్న విషయం జీర్ణించుకోలేని తల్లిదండ్రులు... ఎటుచూసినా కలచివేసే సన్నివేశాలే. ఛిద్రమైన శరీరాలు, విసిరేసినట్టుగా పడివున్న అవయవాలు, రక్తమోడుతున్న క్షతగాత్రులు... పేలుళ్లు జరిగిన స్థలాల్లో అధికారులకు, పోలీసులకు కనిపించిన దృశ్యాలివే. అప్పటిదాకా ఈ స్థాయి ఉగ్రదాడినెరుగని భారతదేశం ఈ కిరాతకంతో చిగురుటాకులా వణికిపోయింది. వెంటనే దర్యాప్తుకు ఉపక్రమించిన అధికారులు పేలుళ్లకు మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం, టైగర్ మెమన్ తదితరులని తెలుసుకున్నారు. పేలుళ్లకు ముందే మెమన్ కుటుంబ సభ్యులు పాకిస్థాన్ పారిపోయారు. అనంతరం యాకూబ్ మెమన్ ను ఢిల్లీ రైల్వే స్టేషన్లో అదుపులోకి తీసుకున్నామని సీబీఐ చెప్పగా, తాను నేపాల్ లో లొంగిపోయానని యాకూబ్ చెప్పాడు. ఇక, ఈ ఘటనకు సంబంధించిన కేసు విషయానికొస్తే... 1993 నవంబర్ 4న 189 మందిని నిందితులుగా పేర్కొంటూ 10వేల పేజీలతో చార్జ్ షీటు దాఖలైంది. ఆ తర్వాత 1995లో ఏప్రిల్ 10న టాడా కోర్టు 26 మందిని విడుదల చేయాలని పేర్కొంది. ఇక, 2001 జులై 18 నాటికి 684 మంది సాక్షుల స్టేట్ మెంట్లను రికార్డు చేశారు. 2006 సెప్టెంబర్ 12న తీర్పు వెలువడింది. ఘటనలో ప్రధాన సూత్రధారులైన దావూద్ ఇబ్రహీం, టైగర్ మెమన్, యాకూబ్ మెమన్ సహా 12 మందికి మరణశిక్ష విధించారు. 20 మందికి జీవితఖైదు పడింది. ప్రస్తుతం దావూద్, టైగర్ దేశం వెలుపలే ఉన్నారు. అసలు ఈ పేలుళ్లకు బీజం పడింది బాబ్రీ మసీదు విధ్వంసం ఘటనతోనే అని చెప్పచ్చు! 1992 డిసెంబర్ 6న కరసేవకులు బాబ్రీని ధ్వంసం చేయడంతో దేశవ్యాప్తంగా ముస్లిం యువత రగిలిపోయింది. తదనంతర అల్లర్లలోనూ పోలీసులు హిందుత్వ వాదులకు మద్దతుగా నిలిచారన్న కసి ముస్లింలలో పేరుకుపోయింది. తమకు అన్యాయం జరిగిందని భావించిన యువకులకు గాలం వేసిన దావూద్ అండ్ కో వారిని తొలుత దుబాయ్ పంపింది. అక్కడి నుంచి పాకిస్థాన్ పంపి తీవ్రవాద శిక్షణ ఇప్పించారు. ఆపై భారత్ వచ్చి వారు ఉగ్రదాడులకు పాల్పడాలని ప్లాన్ చేశారు. ఏప్రిల్ నెలలో వచ్చే శివ్ జయంతి నాడు ముంబయి నగరాన్ని అట్టుడికించాలని ప్రణాళిక రచించారు. అయితే, తీవ్రవాద శిక్షణ పూర్తిచేసుకున్న గుల్లు అనే యువకుడు పోలీసులకు పట్టుబడడంతో పేలుళ్ల ముహుర్తాన్ని దావూద్ గ్యాంగు ముందుకు జరిపింది. విచారణ సందర్భంగా పేలుళ్ల కుట్రకు సంబంధించి గుల్లు చెప్పిన వివరాలను పోలీసులు నమ్మలేదు. అదే ముంబయి ప్రజల పాలిట శాపమైంది. ఆర్డీఎక్స్ పేలుడు పదార్థాలు ఉపయోగించి ముంబయిని అతలాకుతలం చేశారా ముష్కరులు. మూడు హోటళ్లలో సూట్ కేసు బాంబులతో విరుచుకుపడ్డారు. కీలక ప్రాంతాల్లో కారు బాంబులు పేల్చి మారణహోమం జరిపారు. ఆపై ఓ డబుల్ డెక్కర్ బస్సును పేల్చివేయగా, ఆ ఒక్క ఘటనలోనే 90 మంది దాకా అసువులుబాయడం అత్యంత విషాదకరం. సహారా ఎయిర్ పోర్టు వద్ద కూడా గ్రెనేడ్లతో రెచ్చిపోయారు. చివరికి ముంబయిని అత్యంత దయనీయ పరిస్థితిలోకి విసిరేశారు. భారత చరిత్రలో అదొక నెత్తుటి అధ్యాయం!

  • Loading...

More Telugu News