: మేజర్ జనరల్ పృథ్వీరాజ్ గా కలాం... ఉల్లిపాయల లోడులో పోఖ్రాన్ కు యురేనియం!
ఏరోస్పేస్ ఇంజినీరింగ్ చదివిన భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం అణు శాస్త్రవేత్తగానూ రాణించారు. పోఖ్రాన్ అణు పరీక్షణ నిర్వహణలో కీలక భూమిక పోషించారు. మరో శాస్త్రవేత్త ఆర్.చిదంబరంతో కలిపి 1998లో అప్పటి ఎన్డీఏ సర్కారు పోఖ్రాన్ పరీక్షల బాధ్యతను కలాంకు అప్పగించింది. అగ్రరాజ్యం అమెరికాతో పాటు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యులుగా ఉన్న మరో నాలుగు దేశాల కళ్లుగప్పి పరీక్షలను నిర్వహించడం కత్తిమీద సాము లాంటిదే. ఎందుకంటే విదేశీ ఉపగ్రహాలు నిఘా వేసి ఉంచాయి. అణ్వస్త్ర పరీక్షల నిర్వహణకు భారీ గోతులు తవ్వడం, ఆ తర్వాత యురేనియంను అక్కడికి తరలించడం చాలా కష్టం. అయినా కలాం బృందం వెనకడుగు వేయలేదు. ముందుగా పోఖ్రాన్ లో గోతులు తవ్వడం ప్రారంభించారట. దీనిని గమనించిన అమెరికా భారత్ వివరణ కోరింది. 1974లో జరిగిన అణ్వస్త్ర పరీక్షలకు సంబంధించిన పరిణామాలపై అధ్యయనం చేస్తున్నామని ఓసారి, భూ అంతర్భాగంలో పరిశోధనలు చేస్తున్నామని మరోసారి కలాం బృందం సమాధానం చెప్పింది. నెలల తరబడి అక్కడ తవ్వకాలు జరుగుతున్న క్రమంలో అమెరికా కూడా పెద్దగా పట్టించుకోలేదు. గోతులు తవ్వడం పూర్తయింది. ఇక యురేనియం తరలింపునకు రంగం సిద్ధమైంది. అగ్రరాజ్యాల శాటిలైట్ కళ్లకు గంతలు కట్టేందుకు కలాం పక్కా ప్లాన్ వేశారు. ఉల్లిగడ్డలను రవాణా చేస్తున్నట్లు భ్రమింపజేసేలా... కింద యురేనియం, పైన ఉల్లిగడ్డలతో లారీలను నింపేశారు. సరిహద్దు వెంట పాకిస్థాన్ బంకర్లకు అతి సమీపంగా ఉన్న దారి మీదుగా పోఖ్రాన్ కు సదరు లారీలు బయలుదేరాయి. ఈ సమయంలో పోఖ్రాన్ కు వెళ్లిన కలాం మారువేషాన్ని కూడా వేశారు. మేజర్ జనరల్ పృథ్వీరాజ్ అవతారంలో సైనిక దుస్తులు ధరించిన కలాం పోఖ్రాన్ అణు పరీక్షలను విజయవంతంగా ముగించారు.