: కలాం ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనపై ఉంది: లక్ష్మీనారాయణ


మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం మృతి పట్ల సీబీఐ జేడీగా పరిచితులైన ఐపీఎస్ అధికారి లక్ష్మీ నారాయణ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. థానే జాయింట్ కమిషనర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆయన మాట్లాడుతూ, కలాం లాంటి వ్యక్తిని చూడడం అదృష్టమని అన్నారు. ఆయన అందించిన స్ఫూర్తిని మనమంతా కలిసి ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. హైదరాబాదులో ఉండగా, కలాంతో కలిసి పనిచేసే అవకాశం లభించిందని, ఆయన ఆలోచనలు, ఆచరణ అనితరసాధ్యమని అన్నారు. విద్యార్థులు, యువతలో నిద్రాణమై ఉన్న శక్తిని మేల్కొలపాలని ఆయన అనేవారని గుర్తు చేసుకున్నారు. యువత అంతా కలిస్తే 2020 కల్లా భారత్ ను ప్రపంచంలోనే అత్యుత్తమమైన దేశంగా తీర్చిదిద్దవచ్చని చెప్పేవారని ఆయన తెలిపారు. ఆయన ఆలోచనలు, ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని ఆయన సూచించారు. ఆయన ఆలోచనలు భావితరాలకు కథలుగా చెబుదామని ఆయన పిలుపునిచ్చారు. దేశం అంటే భారతదేశం, పౌరులంటే భారతీయులు అనేలా ఉండాలని ఆయన నిరంతరం ఆకాంక్షించేవారని, అలా రూపొందించేందుకు అంతా కలిసికట్టుగా కృషి చేద్దామని ఆయన పిలుపునిచ్చారు.

  • Loading...

More Telugu News