: ఉగ్రవాదులు కాల్పులు జరుపుతున్నా వెరవని డ్రైవర్ నానక్ చంద్ ఏమన్నాడంటే!
పంజాబ్ లోని గుర్ దాస్ పూర్ జిల్లా దీనానగర్ పోలీస్ స్టేషన్ ను ఆక్రమించుకునేందుకు ముందు ఉగ్రవాదులు భారీ విధ్వంసానికి పూనుకున్నారు. దీంతో గుర్ దాస్ పూర్ జిల్లాలో చొరబడిన ఉగ్రవాదులు తెల్లవారుజామున ఓ బస్సుపై ఎటాక్ చేసిన సంగతి తెలిసిందే. ఆ ఘటనపై ఆ బస్సు డ్రైవర్ నానక్ చంద్ స్పందించాడు. ఆయన మాట్లాడుతూ, "జీవితంలో తీవ్రవాదులను ఎదుర్కోవాల్సి వస్తుందని ఊహించలేదు. బమియల్ నుంచి ఛండీగఢ్ కు వెళ్తుండగా, తెల్లవారుజామున సైనిక దుస్తులు ధరించిన ఓ వ్యక్తి, బస్సుపై అకస్మాత్తుగా కాల్పులు జరిపాడు. అయితే ఆ వ్యక్తి ముఖానికి ముసుగు ధరించడంతో తీవ్రవాదిగా భావించి, నేరుగా అతనిపైకి బస్సును నడిపాను. అయితే చివరి నిమిషంలో అతను తప్పుకోవడంతో బస్సును వేగంగా నడిపించి, గుర్ దాస్ పూర్ వైపు 20 కిలోమీటర్లు తీసుకెళ్లా"నని నానక్ చంద్ వెల్లడించారు. ఆయన పొరపాటున భయపడి బస్సును ఆపి ఉంటే పెను ప్రమాదమే జరిగేది. ఎందుకంటే అప్పుడు బస్సులో 70 మంది ప్రయాణికులున్నారు. ముగ్గురు ప్రయాణికులకు తుపాకీ తూటాలు తగిలాయి.