: ఎస్పీ బల్జీత్ సింగ్ అంత్యక్రియలు జరపబోమన్న కుటుంబీకులు... ఉద్యోగాలు ఇస్తేనే అంత్యక్రియలంటూ స్పష్టం
పంజాబ్ లోని దీనానగర్ పోలీస్ స్టేషన్ పై ఉగ్రదాడి నేపథ్యంలో, డిటెక్టివ్ ఎస్పీ బల్జీత్ సింగ్ ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. అయితే, ఆయన అంత్యక్రియలను నిర్వహించేందుకు అతని కుటుంబ సభ్యులు నిరాకరిస్తున్నారు. తన కుమారుడికి ఎస్పీ ర్యాంకు, ఇద్దరు కుమార్తెలకు తహశీల్దార్ ఉద్యోగాలు ఇచ్చేంత వరకు అంత్యక్రియలు నిర్వహించమని ఎస్పీ భార్య కల్వంత్ కౌర్ స్పష్టం చేశారు. ప్రభుత్వం అపాయింట్ మెంట్ లెటర్లు ఇచ్చిన తర్వాతే దహన సంస్కారాలు నిర్వహిస్తామని తెలిపారు. తన మామ అచ్చార్ సింగ్ చనిపోయిన తర్వాత తన భర్తకు ఉద్యోగం రావడానికి రెండేళ్లు వేచి చూడాల్సి వచ్చిందని... అందుకే తాము ఈ డిమాండ్ చేస్తున్నామని అన్నారు. అచ్చార్ సింగ్ కూడా పోలీస్ ఆఫీసర్ గా పనిచేస్తూనే, విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయారు.