: కలాంకు తన హెయిర్ స్టైల్ అంటే అమిత ఇష్టం... ఆ హెయిర్ స్టైల్ వెనకున్న కథ ఇదిగో!
చిన్న పిల్లలను తలపించే కల్మషం లేని నవ్వుతో ఎప్పుడూ కనిపించే అబ్దుల్ కలాంను చూడగానే... ముందు ఆయన హెయిర్ స్టైల్ మనల్ని ఆకట్టుకుంటుంది. విలక్షణమైన హెయిర్ స్టైల్ ఆయన సొంతం. దేశాధినేతలైనా, ప్రముఖ శాస్త్రవేత్తలైనా, విద్యార్థులైనా, ప్రజలైనా ఆయన హెయిర్ స్టైల్ ను కన్నార్పకుండా చూడాల్సిందే. ఈ హెయిర్ స్టైల్ వెనుక పెద్ద కథే ఉంది. తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో ఉన్న సొంత ఊరిలో ఆయన పూర్వీకులంతా ఇలాగే కొంత పొడవైన జుట్టును పెంచుకునేవారట. అదే విధానాన్ని కలాం కూడా కొనసాగించారు. జీవితంలో ఒక్కో మెట్టు ఎక్కుతూ, ఉన్నత శిఖరాలను అధిరోహిస్తున్నప్పుడు కూడా ఆయన తన హెయిర్ స్టైల్ ను మార్చుకోలేదు. మరో విషయం ఏమిటంటే, ఆయనకు తన హెయిర్ స్టైల్ అంటే చాలా ఇష్టం. దాన్ని స్టైల్ గా ఉంచుకోవడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకునేవారు. తరచూ తన తలను దువ్వుకోవడం ఆయనకు అలవాటు. పెద్ద పెద్ద సెమినార్లలో సైతం తన జుట్టును చేత్తో పైకి దువ్వుతూ ప్రసంగించడం ఆయన స్టైల్. ఢిల్లీలో హబీబ్ కుటుంబీకులు నిర్వహిస్తున్న సెలూన్ లో కలాం హెయిర్ కటింగ్ చేయించుకునేవారు. ఇందుకుగాను కలాం నుంచి వారు రూ. 500 తీసుకునేవారట. ఇదీ ఆయన హెయిర్ స్టైల్ కథ.