: ఉగ్రవాదుల లక్ష్యం పోలీసులు కాదా?
పంజాబ్ లో గుర్ దాస్ పూర్ జిల్లాలోని దీనానగర్ పోలీస్ స్టేషన్ లో చొరబడి 13 మందిని పొట్టనబెట్టుకున్న ఉగ్రవాదుల లక్ష్యం ఏంటి? అసలు ఉగ్రవాదులు ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడికి వెళ్తున్నారు? వారి లక్ష్యం ఏంటి? అనే దానిపై నిపుణులు స్పందిస్తున్నారు. పాకిస్థాన్ నుంచి వచ్చిన ఉగ్రవాదులు భారీ విధ్వంసానికి రచన చేసి భారత్ లో అడుగుపెట్టారు. వారి లక్ష్యం అమర్ నాథ్ యాత్రికులు. వీలైనంత ఎక్కువ మంది అమర్ నాథ్ యాత్రికులను పొట్టనబెట్టుకోవాలన్న ఉద్దేశంతోనే వారు సరిహద్దులు దాటారు. అదే లక్ష్యంతో తెల్లవారుజామున బస్సుపై కాల్పులకు దిగారు. బస్సులో యాత్రికులను పొట్టనబెట్టుకోవాలని భావించారు. సరిహద్దులకు దగ్గరగా ఉండడంతో వారు గుర్ దాస్ పూర్ లో చొరబడ్డట్టు నిపుణులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో వారు పోలీసులను మట్టుబెట్టి తప్పించుకుని పారిపోవచ్చని భావించారు. అయితే సైనిక దుస్తుల్లో వస్తున్న తమని చూసి అంతత్వరగా స్థానిక పోలీసులు స్పందిస్తారని ఉగ్రవాదులు ఊహించలేకపోయారు. దీంతో వారు తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొన్నారు. చివరకు ముగ్గురు మరణించగా, ఒక్కరు ప్రాణాలతో పట్టుబడ్డారని నిపుణులు చెబుతున్నారు.