: వ్యక్తులపై కాదు...వ్యవస్థపై దాడి జరుగుతోంది: బొత్స
ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ అధికారం చేపట్టిన తరువాత అరాచక పరిస్థితులు ఏర్పడ్డాయని వైఎస్సార్సీపీ నేత బొత్స సత్యనారాయణ తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగులపై వరుస దాడులు జరుగుతున్నాయని అన్నారు. రియల్, ఇసుక మాఫియా ఆగడాలు పెరిగిపోయాయని ఆయన తెలిపారు. గతంలో ఇసుక మాఫియా ఎమ్మార్వోపై దాడికి దిగితే, తాజాగా రియల్ మాఫియా రాజధాని పరిసరాల్లో వీఆర్వోపై దాడికి దిగిందని ఆయన మండిపడ్డారు. ఉద్యోగులపై జరుగుతున్న దాడులు వారిపై వ్యక్తిగతంగా జరుగుతున్నవి కాదని, వ్యవస్థపై జరుగుతున్న దాడులుగా భావించాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ రకమైన దాడులకు రాష్ట్ర ప్రభుత్వం వత్తాసు పలుకుతోందని, అందుకే ఉద్యోగులకు రక్షణ లేకుండా పోయిందని ఆయన విమర్శించారు.